గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టుకు వరద రాక కొనసాగుతోంది. జూరాల వద్ద ప్రస్తుతం 318.44 మీటర్ల మేర నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 5,800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. ఇక్కడి నుంచి నెట్టెంపాడు లిఫ్ట్కు 1500, బీమా లిఫ్ట్-1కి 1300, బీమా లిఫ్ట్ 2కి 750, కోయిల్ సాగర్ లిఫ్ట్ కు 630, లెఫ్ట్ కెనాల్ కు 1030, రైట్ కెనాల్ కి 650, పారలల్ కెనాల్ కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి మొత్తం 5,882 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.
మరో వైపు తెలంగాణ మంత్రుల బృందం రిక్వెస్ట్ మేరకు కర్ణాటక ప్రభుత్వం విడుదల చేస్తామన్న మూడు టీఎంసీల నీటిని ఇంకా విడుదల చేయలేదు. ప్రస్తుతం వరద నిలిచిపోయాక అవసరం ఉన్నప్పుడు షెడ్యూల్ ప్రకారం కర్ణాటక నుంచి నీటిని విడుదల చేసుకునేందుకు ఇరిగేషన్ ఆఫీసర్లు ప్లాన్ చేస్తున్నారు.
కర్ణాటక నుంచి నీటి విడుదల ప్రారంభం అయ్యాక జూరాల ఆయకట్టుకు వారబంది పద్ధతిలో నీటిని విడుదల చేసేలా ఆఫీసర్లు ప్రణాళికలు వేసుకుంటున్నారు. నవంబర్ చివరి వరకు నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
