- ఓసీపీతో ప్రమాదం లేదన్న ఐఐటీ మద్రాస్, ఎన్ఐహెచ్ రూర్కీ
- ప్రభుత్వానికి, ఏఎస్ఐకి, ములుగు కలెక్టర్‌కు అందిన నివేదికలు
- నష్టం కలిగించే చర్యలనూ అంగీకరించమన్న హెరిటేజ్ కమిటీ
- టెంపుల్ చుట్టూ 10 కి.మీ బఫర్ జోన్ ప్రకటించాలని డిమాండ్
హైదరాబాద్, వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ములుగు జిల్లాలోని వెంకటాపూర్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనితో ప్రఖ్యాత రామప్ప ఆలయానికి ఎలాంటి ముప్పు లేదని ఐఐటీ మద్రాస్, ఎన్ఐహెచ్రూర్కీ అధ్యయనాల్లో తేలింది. ఈ రెండు ప్రతిష్టాత్మక సంస్థలు క్షేత్రస్థాయిలో వివిధ అంశాలను సమగ్రంగా పరిశీలించి రూపొందించిన నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. సర్కారు ఆదేశాలతో రంగంలోకి దిగిన ములుగు జిల్లా కలెక్టర్.. స్థానికులు, రామప్ప పరిరక్షణ కమిటీ సభ్యులతో చర్చలు ప్రారంభించారు.
ఓసీపీ పనులు చేపట్టడం వల్ల రామప్ప ఆలయానికి ఎలాంటి ముప్పు ఉండదని భరోసా ఇస్తున్నారు. మరోసారి ఓపెన్ కాస్ట్ అంశం తెరపైకి రావడంతో స్థానికులు, రామప్ప పరిరక్షణ కమిటీ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి నష్టం కలిగించే పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించమని హెరిటేజ్ కమిటీ ప్రతినిధులు తేల్చిచెప్తున్నారు. అలాగే, రామప్ప టెంపుల్ చుట్టూ 10 కిలో మీటర్ల పరిధిని బఫర్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్య మళ్లీ మొదటికి రావడంతో దీనిపై ఎలా ముందుకెళ్లాలో తెలియక సింగరేణి అధికారులు తలపట్టుకుంటున్నారు.
వెంకటాపూర్ ఓసీపీలో 40.43 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయం ఉంది. ఈ టెంపుల్‌కు 6 కిలోమీటర్ల దూరంలోని వెంకటాపూర్ గ్రామ శివారులో 40.43 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు సింగరేణి గుర్తించింది. అన్ని రకాల సర్వేలు నిర్వహించి 19 ఏండ్ల పాటు బొగ్గు తవ్వకాలు జరపాలని భావిస్తూ కేంద్రం నుంచి అనుమతులు తీసుకుంది. 314 హెక్టార్ల అటవీ భూములు, 1,480 హెక్టార్ల వ్యవసాయ, ప్రభుత్వ, అసైన్డ్ భూములను సేకరించాలని ప్రతిపాదించింది. కొంత భూమి సేకరించి హద్దులు ఏర్పాటు చేసి రోడ్డు కూడా వేసింది. భూసేకరణ కింద రైతులకు నష్ట పరిహారం అందించి, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపచేసిన అనంతరం 2020లో భూమిపూజల చేశారు. 2021 డిసెంబర్ నెలలో ఓపెన్ కాస్ట్ తవ్వకాలు జరపాలని భావించింది. దీనికి అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు.
యునెస్కో గుర్తింపుతో పరిస్థితి తారుమారు
రామప్ప ఆలయానికి జులై 25, 2021న ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు ఇచ్చింది. దేశ, విదేశీ పర్యాటకులు పెరుగుతుండడంతో ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి ఓసీపీ విషయం బయటకు వచ్చింది. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ప్రభావం చుట్టుపక్కల 10 కిలోమీటర్ల మేర ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. బొగ్గు తవ్వకాల కోసం భూ అంతర్భాగంలో చేసే పేలుళ్ల వల్ల రామప్ప ఆలయ ఇసుక పునాది (శాండ్‌బాక్స్) సాంకేతికత దెబ్బతినే ప్రమాదం ఉందని.. అలాగే, రామప్ప సరస్సు సైతం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని ఎక్స్ పర్ట్స్ హెచ్చరించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) స్టడీలో బ్లాస్టింగ్ వల్ల రామప్ప ఆలయం ఫౌండేషన్, రామప్ప సరస్సుపై ప్రభావం ఉండవచ్చని తేలింది. ఫాల్ట్స్, బెడ్డింగ్ జాయింట్స్, బరీడ్ ఛానెల్స్ ద్వారా నీటి కదలికలు ప్రభావితం కావచ్చని హెచ్చరించింది.
మళ్లీ తెరపైకి ఓపెన్ కాస్ట్
రాష్ట్రంలో నాణ్యమైన బొగ్గుకు కొరత ఏర్పడింది. ఈ క్రమంలో వెంకటాపూర్ ఓసీపీ స్టార్ట్ చేస్తే 40 మిలియన్ టన్నుల బొగ్గు వినియోగించుకోవచ్చని సింగరేణి సంస్థ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో అప్పట్లో వచ్చిన వదంతుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం డిటైల్డ్ సైంటిఫిక్ రిపోర్ట్ తెప్పించాలని ఆదేశించింది. దీంతో సింగరేణి సంస్థ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ అనుమతులు తీసుకొని ఐఐటీ మద్రాస్, ఎన్ఐహెచ్ రూర్కీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పరీక్షలు నిర్వహించింది. బాంబ్ బ్లాస్టింగ్స్ వల్ల కలిగే గ్రౌండ్ వైబ్రేషన్స్ రామప్ప ఆలయం దగ్గరికి రావని తాజా నివేదికల్లో తేలింది. ‘రామప్ప గుడి 3.3 హెచ్జడ్ వరకు ఫ్రీక్వెన్సీలను తట్టుకోగలదు. ప్రతిపాదిత మైనింగ్ బ్లాస్టింగ్ తీవ్రత 5 కిలో మీటర్ల పరిధిలో దాదాపు 0.01 హెచ్ జడ్ వరకు మాత్రమే ఉంది. ఓసీకి రామప్ప టెంపుల్‌కి మధ్య 5.8 కిలో మీటర్ల దూరం ఉన్నందున గుడికి ఎలాంటి ముప్పు ఉండదు’ అని ఐఐటీ మద్రాస్, ఎన్ఐహెచ్ రూర్కీ ఇచ్చిన స్టడీ రిపోర్టుల్లో స్పష్టం చేసినట్టు సింగరేణి ఆఫీసర్లు వెల్లడించారు.
ములుగు జిల్లా కలెక్టర్‌కు నివేదిక..
ఐఐటీ మద్రాస్, ఎన్ఐహెచ్రూర్కీ జరిపిన సైంటిఫిక్ స్టడీకి సంబంధించిన నివేదికలు ప్రభుత్వంతో పాటు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు, ఇటీవలే ములుగు జిల్లా కలెక్టర్‌కు అందాయి. ఈ రిపోర్టుల ఆధారంగా ప్రజలకు అవగాహన కల్పించి, ఓపెన్ కాస్ట్ పనులు ప్రారంభించడానికి అనుమతించాలని కలెక్టర్‌కు సింగరేణి విజ్ఞప్తి చేసింది. దీంతో ఇటీవలే ఈ స్టడీ నివేదికల సారాంశాన్ని స్థానికులకు, రామప్ప పరిరక్షణ కమిటీ, హెరిటేజ్ ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు. కానీ, వాళ్లెవరూ దీనికి ఒప్పుకోలేదు సరికదా, రామప్ప గుడి చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిని బఫర్ జోన్‌గా ప్రకటించి ఎలాంటి మైనింగ్ జరపకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. మరోవైపు రామప్ప పరిరక్షణ కమిటీ, హెరిటేజ్ ప్రతినిధులు ఇటీవల హనుమకొండలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మరోసారి ‘సేవ్ రామప్ప’ ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
‘సేవ్ రామప్ప’ ఉద్యమం
స్థానికులు, హెరిటేజ్ కమిటీ వ్యతిరేకతకు తోడు అప్పట్లో ‘సేవ్ రామప్ప’ ఉద్యమం మొదలైంది. స్థానికులు, రామప్ప పరిరక్షణ కమిటీ, హెరిటేజ్ కమిటీతో పాటు సామాజికవేత్తలు, చరిత్రకారులు సింగరేణి ఓసీపీ నుంచి రామప్పను రక్షించాలని, ఆలయం చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిని బఫర్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సింగరేణి ఆఫీసర్లు వెనక్కి తగ్గారు. భూసేకరణ కోసం రైతులతో మాట్లాడటానికి ఏర్పాటు చేసిన సభలన్నీ రద్దు చేసుకున్నారు. మిగిలిన రైతులకు నష్ట పరిహారం కూడా ఇవ్వలేదు. భూసేకరణ వివరాలను ప్రకటించలేదు.
