200 సివిల్‌‌‌‌ కోర్టులకు గ్రీన్‌‌సిగ్నల్..పెండింగ్ కేసుల పరిష్కారానికి సర్కారు నిర్ణయం

200 సివిల్‌‌‌‌ కోర్టులకు గ్రీన్‌‌సిగ్నల్..పెండింగ్ కేసుల పరిష్కారానికి సర్కారు నిర్ణయం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 200 కొత్త జూనియర్ సివిల్ జడ్జి కమ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్‌‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కోర్టుల్లో పెండింగ్‌‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు అదనంగా 594 కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీ చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించింది. ఇందులో మొదటి విడతగా 200 కోర్టులకు అనుమతిస్తూ న్యాయశాఖ కార్యదర్శి బి. పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త కోర్టులకు అవసరమైన సిబ్బంది, ఇతర ఖర్చులకు సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 

జిల్లాల వారీగా కోర్టుల కేటాయింపులో రంగారెడ్డి జిల్లా కోర్టు పరిధికి అత్యధికంగా 30 కోర్టులు మంజూరయ్యాయి. మేడ్చల్‌‌-మల్కాజిగిరి పరిధిలో 16, వరంగల్‌‌-హనుమకొండలో 12, నల్గొండలో 10 కోర్టులు కేటాయించారు. ఖమ్మం, కరీంనగర్‌‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 8 చొప్పున, సూర్యాపేటలో 7, నిజామాబాద్‌‌, జగిత్యాలలో 6 చొప్పున కొత్త కోర్టులు మంజూరయ్యాయి. సిద్ధిపేట, మంచిర్యాల జిల్లాలకు 5 చొప్పున కోర్టులు కేటాయించారు.