- మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు గెలుపు బాధ్యతలు
- మహేశ్‌గౌడ్ ప్రకటనపై అధికారపార్టీలో భిన్నాభిప్రాయాలు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సాధారణ ఎన్నికల మాదిరే యూనియన్లు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. దాదాపు దశాబ్దం తర్వాత వచ్చే నెల 9 న ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగనుండడంతో 10కి పైగా యూనియన్లు పోటీ పడుతున్నాయి. ఇందులో కొన్ని యూనియన్లు రాజకీయ పార్టీల కార్మిక విభాగాలకు అనుబంధంగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం నేరుగా పొలిటికల్ పార్టీలు ఎంటర్‌కావడం ఆసక్తి రేపుతున్నది. తెలంగాణ వర్కర్స్ యూనియన్ ( టీడబ్ల్యూయూ) కు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం ప్రకటించారు. ఆర్టీసీ ఎన్నికల్లో ఈ యూనియన్‌ను గెలిపించాల్సిన బాధ్యత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు తీసుకోవాలని సూచించారు. టీడబ్ల్యూయూను గెలిపించే బాధ్యతను మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు అప్పగిస్తూ ఆయన్ను పార్టీ ఇన్‌చార్జిగా నియమించారు.
మహేశ్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు..
పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ నిర్ణయంపై కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కార్మిక సంఘం ఐఎన్టీయూసీకి అనుబంధ ఆర్టీసీ యూనియన్ ఎస్‌డబ్ల్యూయూ ఉండగా.. ఆ యూనియన్‌ను కాదని, టీడబ్ల్యూయూకు ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అందుకు గల కారణాలేమిటో చెప్పాలంటూ ఆ యూనియన్మద్దతుదారులు 15 ప్రశ్నలతో మహేశ్ గౌడ్‌కు లేఖ రాయడం అటు యూనియన్లలో, ఇటు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఐఎన్టీయూసీకి సంజీవరెడ్డి అధ్యక్షుడిగా ఉండగా, కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న టీడబ్ల్యూయూకు కాంగ్రెస్ నేత మొగుళ్ల రాజిరెడ్డి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరి మధ్య కొనసాగుతున్న వివాదం ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడి ప్రకటనతో సరికొత్త సమస్యకు తెరలేపింది.
ఏకతాటిపైకి 3 యూనియన్లు..
మరోవైపు అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు ఆర్టీసీలోని మరో 3 యూనియన్లు ఒక్కటయ్యాయి. ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ కొత్త కూటమిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించాయి. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈ కూటమినే గెలిపించాలని ఈయూ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు కొన్ని యూనియన్లు బీఆర్ఎస్, బీజేపీ మద్దతు కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేశాయి.
