‘బడా గణేశ్’ లెక్కలు చెప్తలేరు.. మూడేళ్ల నుంచి ఇదే తంతు.. 11 రోజులు, 20 హుండీలు

‘బడా గణేశ్’ లెక్కలు చెప్తలేరు.. మూడేళ్ల నుంచి ఇదే తంతు.. 11 రోజులు, 20 హుండీలు
  •  20 హుండీలు ఏర్పాటు చేసిన రెండు ఉత్సవ కమిటీలు  
  •  11 రోజుల్లో కానుకలు సమర్పించిన లక్షల మంది  
  •  ఫ్రీ కరెంట్​ ఇస్తున్న సర్కారు
  •  సహకరిస్తున్న స్పాన్సర్లు

పంజాగుట్ట, వెలుగు:  ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి కాగానే..   ఆదాయ, వ్యయం ఎంత అయిందనే చర్చ మొదలైంది.  గత మూడేళ్లుగా ఖైరతాబాద్ బడా గణేశ్ ఉత్సవ కమిటీ ఈ లెక్కల్ని భక్తులకు చెప్పడం లేదు.  దీనిపై భక్తులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద క్యూ ఆర్ కోడ్ లు ఏర్పాటు చేశారు. దీంతో పాటు నలువైపులా హుండీలను కూడా పెట్టారు.11 రోజులుగా పూజలు అందుకున్న బడా గణేశ్ వద్ద ఎంత ఆదాయం వచ్చింది. భక్తులు ఏమేం కానుకలిచ్చారు.  ఎంత వ్యయమైందనే వివరాలు వెల్లడించడం లేదు.  దీనిపై ఈసారైనా ఉత్సవ కమిటీ ఏం చెబుతుందోననే అందరూ వేచి చూస్తున్నారు. 

11 రోజులపాటు అన్నదానం

ఖైరతాబాద్ లో ప్రస్తుతం ఉత్సవ కమిటీలు రెండు ఉన్నాయి.  ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ చైర్మన్ గా  మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు. జీహెచ్‌‌‌‌ఎంసీ, పోలీసులకు, బడా గణేశుడి వద్ద సేవ చేసే వారికి ఆయన 11 రోజుల పాటు అన్నదానం చేస్తున్నారు.  శ్రీ గణేశ్ ఉత్సవ కమిటీకి చైర్మన్ రాజ్ కుమార్ ఉన్నారు. ఈ రెండు ఉత్సవ కమిటీలు ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద దాదాపు 20 హుండీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అయితే వీటితో పాటు క్యూ ఆర్ కోడ్ లు కూడా పెడుతున్నాయి.  

ఈ హుండీల్లో దాదాపు 11 రోజులుగా లక్షల మంది భక్తులు వచ్చి కానుకలు సమర్పించుకుంటున్నారు. విగ్రహానికి పూల దండల నుంచి, పూజ సామగ్రితో పాటు.. ఇతర అనేక ఖర్చులు దాతలు స్పాన్సర్ చేస్తున్నారు. అయితే విగ్రహం తయారీ, చిన్న చిన్న ఖర్చులు మినహాయించి ఉత్సవ కమిటీ పెద్దగా ఖర్చు పెట్టడంలేదని భక్తులు ఆరోపిస్తున్నారు.  ప్రభుత్వం కూడా పోలీసుల భద్రతతో పాటు.. అనేక సౌకర్యాలు కల్పిస్తోంది.  

కరెంట్ ను కూడా ఉచితంగా అందిస్తోంది.  అయితే ప్రభుత్వం, స్పాన్సర్లు ఇంత సహకరిస్తున్నప్పటికీ..  ఉత్సవ కమిటీల మధ్య ఉన్న విబేధాల కారణంగానే భక్తులు హుండీల్లో 11 రోజులు వేస్తున్న కానుకల లెక్కలు తేల్చడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈసారైనా ఖైరతాబాద్ వినాయకుడి వద్ద ఆదాయ, వ్యయాల గురించి చెప్పాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.