భద్రాచలం, వెలుగు: భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. తుఫాన్కారణంగా ఉత్తర తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ లలో విస్తారంగా కురిసిన వర్షాలతో గోదావరి ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలానికి ఎగువన తాలిపేరు, ఇంద్రావతి ఉపనదులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. తాలిపేరు ప్రాజెక్టు నుంచి 65 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.
ప్రాణహిత నుంచి కూడా గోదావరిలోకి లక్ష క్యూసెక్కుల వరద వచ్చి కలుస్తోంది. జగదల్పూర్, చింద్నార్గేజింగ్స్టేషన్ల వద్ద ఇంద్రావతి నది వరద నీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోందని సీడబ్ల్యూసీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం గోదావరి పరీవాహక ప్రాంతంలో రెడ్అలర్ట్ ప్రకటించింది.
భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నది 20 అడుగుల మేర ప్రవహిస్తోంది. 1,69,271 క్యూసెక్కుల మేర నీరు దిగువకు ప్రవహిస్తోంది. మరోవైపు దిగువన శబరికి కూడా వరద పోటెత్తుతుండడంతో గోదావరికి వరద ముప్పు పొంచి ఉంది. కిన్నెరసాని రిజర్వాయర్ పూర్తిగా నిండింది. గడిచిన 24 గంటల్లో భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు 43 అడుగుల వరకు గోదావరి నీటి మట్టం చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 2.35లక్షల ఎకరాల పత్తి పంటకు ఊపిరిపోసింది. వరి పంటకు కూడా మేలు జరిగింది. జిల్లాలోని పాత వంతెనలు, కల్వర్టులు, రహదారులను పరిశీలించి ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న స్కూల్ భవనాలను వినియోగించొద్దని సూచించారు. అధికారులు హెడ్‌క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
