- ఇంపాల్‌లో కార్యకర్తలపై టియర్ గ్యాస్ ప్రయోగం
- గువాహటి, కోల్‌కతాలో జ్ఞానేశ్ దిష్టిబొమ్మల దహనం
- హర్యానాలో ఆందోళనకారులపై లాఠీచార్జ్, వాటర్ కెనాన్స్
- జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో బ్యానర్లతో ఎమ్మెల్యేల నిరసన
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) అవకతవకల నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీ, అస్సాం, బిహార్, చండీగఢ్, మణిపూర్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, జమ్ముకాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
కొన్ని ప్రాంతాలలో నిరసనకారులకు పోలీసులకు మధ్య తోపులాటలతో ఉద్రిక్తత నెలకొంది. కొన్నిచోట్ల పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రైసినా రోడ్డు నుంచి జంతర్ మంతర్ వైపు ర్యాలీ తీయగా పోలీసులు అడ్డుకున్నారు. జంతర్ మంతర్ వద్ద ఐసా ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఈ నిరసనలకు అనుమతి లేదంటూ ఐసా ప్రెసిడెంట్ నేహా బోరా, యాక్టివిస్టులు యోగేంద్ర యాదవ్, అంజలి భరద్వాజ్, ఇతరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
చండీగఢ్‌లో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. హర్యానాలో మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, పార్టీ రాష్ట్ర చీఫ్ రావ్ నరేంద్ర సింగ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సంజయ్ దత్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యకర్తలు బారికేడ్లను బద్దలు కొట్టి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం వైపు వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ కెనాన్లను ఉపయోగించారు. గువాహటిలో కాంగ్రెస్ ఆఫీసు నుంచి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం వైపు మార్చ్ చేస్తున్న సమయంలో నిరసనకారులు పోలీసు బారికేడ్లను బద్దలు కొట్టారు. జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను కాల్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్, పలువురు సీనియర్ నేతలను అరెస్ట్ చేశారు.
మణిపూర్‌లో టియర్ గ్యాస్ ప్రయోగం..
మణిపూర్‌లో నిరసన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. రాజధాని ఇంఫాల్‌లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం వైపు ర్యాలీకి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ సందర్భంగా ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. పాట్నాలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల సంఘం ఆఫీసు వైపు ర్యాలీ తీశారు. పోలీసులు వాటర్ కెనాన్లతో వారిని చెదరగొట్టారు. కోల్‌కతాలో కలకత్తా యూనివర్సిటీ కాలేజ్ స్ట్రీట్ క్యాంపస్ వెలుపల నుంచి రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం వైపు బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ శుభంకర్ సర్కార్ ర్యాలీ నిర్వహించారు.
సెంట్రల్ కోల్‌కతాలో పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులు జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. షిమ్లాలో ఎన్నికల సంఘం కార్యాలయం వెలుపల కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. గోడలపై ఓట్ చోర్ అని రాశారు. జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. లక్నో, జమ్మూ, శ్రీనగర్‌లో కూడా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. శ్రీనగర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల ఆయన రాజీనామా కోరుతూ బ్యానర్లతో నిరసన తెలిపారు. హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఇతర నేతల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
- భువనేశ్వర్‌లో ఉద్రిక్తత..
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం వెలుపల ఒడిశా కాంగ్రెస్ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ పార్టీ కార్యకర్తలతో కలిసి బైఠాయించారు. పోలీసులు భక్తచరణ్ దాస్‌ను, పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఫుట్‌పాత్‌పై శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా, పోలీసులు నిర్బంధించడంపై భక్తచరణ్ దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు. కాగా, ఈ నెల 28న జిల్లా స్థాయిలో మరో విడత నిరసనలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
