నీళ్లలో నాణ్యతకు ‘క్లీన్’ చిట్..రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి రైల్వే స్టేషన్లలో వాటర్‌‌ సేఫ్

నీళ్లలో నాణ్యతకు ‘క్లీన్’ చిట్..రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి రైల్వే స్టేషన్లలో వాటర్‌‌  సేఫ్
  •     255 నీటి నమూనాలు..  సురక్షితమని నిర్ధారణ

హైదరాబాద్, వెలుగు: ప్రయాణికులు, సిబ్బందికి సురక్షితమైన తాగునీటిని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే నీటి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. ఇందులో భాగంగా రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి రైల్వే స్టేషన్లలో నీటి వనరులు, సరఫరా కేంద్రాలు, నిల్వ ట్యాంకులు, క్లోరినేషన్, పంపిణీ వ్యవస్థలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారు. నీటిలో ఈ.కోలి బ్యాక్టీరియా ఉనికిని గుర్తించేందుకు బ్యాక్టీరియాలజీ పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవశేష క్లోరిన్ స్థాయిలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు. 

ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో భూగర్భ జలాశయాలు, ఇతర నీటి నిల్వ ట్యాంకులను శుభ్రం చేస్తున్నారు. ఈనెల 9 నుంచి 15 వరకు రామగుండం (93), మంచిర్యాల (105), బెల్లంపల్లి  (57) రైల్వే స్టేషన్లలో పరీక్షించిన  మొత్తం 255 నీటి నమూనాలు సంతృప్తికరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏ ఒక్క నమూనా కూడా వినియోగానికి అనర్హమైనదిగా తేలలేదని, ఈ.కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు కూడా గుర్తించలేదని వెల్లడించారు. ఈనెల 25న రామగుండం రైల్వే స్టేషన్‌‌లో నీటి నాణ్యత పరీక్ష కూడా నిర్వహించగా, అవశేష క్లోరిన్ స్థాయిలను తనిఖీ చేయగా అవి నిర్దేశిత పరిమితుల్లోనే ఉన్నట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. టీడీఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్), పీహెచ్ (హైడ్రోజన్ పొటెన్షియల్ ) స్థాయిలు కూడా నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారించారు.