హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న దాదాపు 2,500 డీఎల్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం (టీజీసీటీఏ)రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బ్రిజేశ్ కోరారు. సర్కారు డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల నియామకాల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 4ను తక్షణమే విత్డ్రా చేసుకోవాలని రిక్వెస్ట్చేశారు. వివాదాస్పద నూతన విధానాన్ని పక్కనపెట్టి, గతంలో అమలైన పాత పద్ధతిలోనే రిక్రూట్‌మెంట్ ప్రక్రియను చేపట్టాలని టీజీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేశారు. పేద, మధ్యతరగతి గ్రామీణ విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన ఉన్నత విద్యను అందించే ఏకైక కేంద్రాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలేనని, అలాంటి వ్యవస్థను కాపాడాలంటే పారదర్శక పద్ధతిలోనే నియామకాలు జరగాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2011, 2013 సంవత్సరాల్లో ఏపీపీఎస్సీ ద్వారా డిగ్రీ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేశారని, ఆ తర్వాత నేటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 6 ఆధారంగా 50 శాతం ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీగా ఉన్న దాదాపు 2,500 పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని విన్నవించారు.
