జల సంరక్షణకు యాక్షన్ ప్లాన్.. మెదక్ జిల్లాలో ముమ్మరంగా జలసిరి పనులు మంజూరు 

జల సంరక్షణకు యాక్షన్ ప్లాన్.. మెదక్ జిల్లాలో ముమ్మరంగా జలసిరి పనులు మంజూరు 
  • ఎల్‌‌‌‌‌‌‌‌నినో నేపథ్యంలో భూగర్భజలాలు పెంపొందించే పనులకు ప్రాధాన్యం
  • ఫామ్ పాండ్లు, సోక్​పిట్‌‌‌‌‌‌‌‌లు, బోర్​రీచార్జి స్ట్రక్చర్లు మంజూరు

మెదక్, వెలుగు: ఎల్‌‌‌‌‌‌‌‌నినో నేపథ్యంలో భూగర్భజలాలు పెంపొందించే వీబీజీ రాంజీ పథకంలో పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో నీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ‘జలసిరి’లో భాగంగా అన్ని జిల్లాల్లోనూ జల సంరక్షణకు దోహదపడే నిర్మాణాలు ప్రతి గ్రామంలో విధిగా చేపట్టేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌ రూపొందించారు. 

భూమిపై పడే ప్రతి నీటి బొట్టును భూమిలోకి ఇంకింపజేసేలా ‘ప్రతి ఇంటికి ఇంకుడుగుంత, ప్రతి పంటకు పంట కుంట, ప్రతి ఊరికి ఊట కుంట’ నినాదంతో భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు ప్రారంభించారు. ఇందుకు అనుగుణంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లాల వారీగా యాక్షన్​ ప్లాన్​ రూపొందించి నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు చేపట్టేలా కృషి చేస్తోంది. 

ప్రతి జీపీలో సోక్‌‌‌‌‌‌‌‌ పిట్‌‌‌‌‌‌‌‌, ఫామ్ పాండ్స్, రీచార్జి గుంతలు 

మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 492 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ జలసిరి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి 80 చొప్పున సోక్ పిట్స్, రెండు కమ్యూనిటీ సోక్ పిట్స్, రెండు ఫామ్‌‌‌‌‌‌‌‌ పాండ్స్‌‌‌‌‌‌‌‌, రెండు బోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ రీచార్జి గుంతలు, ఒక్కో జీపీకి ఒకటి చొప్పున 492 పర్క్యులేషన్ ట్యాంకులు నిర్మించేలా యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఈ పనుల వల్ల అటు ఉపాధి కూలీలకు మరిన్ని పనిదినాలు లభించడంతోపాటు, భూగర్భ జలాల వృద్ధికి దోహదపడనుంది. 

పనుల మంజూరు ఇలా

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,166 ఫామ్‌‌‌‌‌‌‌‌ పాండ్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.1.20 లక్షలు, రూ.1.90 లక్షలు ఖర్చయ్యే ఫామ్ పాండ్లు ఉన్నాయి. మంజూరైన వాటిలో ఇప్పటివరకు 435 గ్రౌండ్​కాగా, 29 ఫామ్ పాండ్లు నిర్మాణాలు పూర్తయ్యాయి. అలాగే ఒక్కోదానికి రూ.6,796 ఖర్చయ్యే వ్యక్తిగత సోక్ పిట్‌‌‌‌‌‌‌‌లు, 2,400 మంజూరవగా, అందులో 282 గ్రౌండింగ్ చేయగా.. 104 పూర్తయ్యాయి. రూ.13,400 నిర్మించే కమ్యూనిటీ సోక్​పిట్‌‌‌‌‌‌‌‌లు 687 మంజూరు కాగా ఇప్పటివరకు 78 గ్రౌండింగ్ అయ్యాయి. 

వాటిలో 20 పూర్తయ్యాయి.  రూ.35,426తో నిర్మించే బోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ రీచార్జి స్ట్రక్చర్లు 382 మంజూరు కాగా అందులో 20 గ్రౌండ్​ అయ్యాయి. మంజూరైన ఫామ్ పాండ్లు, సోక్​ పిట్‌‌‌‌‌‌‌‌లు, బోర్​వెల్​రీచార్జి స్ట్రక్టర్లు త్వరితగతిన పూర్తి చేయించడంపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.