బొలెరో, ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి, 9 మందికి గాయాలు

బొలెరో, ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి, 9 మందికి గాయాలు
  • ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఘటన

తాడ్వాయి, వెలుగు: బొలెరో వాహనాన్ని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొనడంతో ఒకరు చనిపోగా, మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తి క్రాస్ సమీపంలో శుక్రవారం జరిగింది.

ఎస్సై జగదీశ్, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రాంచంద్రాపూర్​పరిధి సోమ్లాతండా, వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి, పర్వతగిరి మండలం అన్నారం గ్రామాలకు చెందిన 16 మంది కలిసి తమ బంధువు అస్థికలు గోదావరిలో కలిపేందుకు వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత శుక్రవారం ఉదయం తిరిగి వస్తున్నారు.

ఈ క్రమంలో తాడ్వాయి మండలం కొండపర్తి సమీపంలోకి రాగానే హన్మకొండ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న సూపర్​లగ్జరీ బస్సు బొలెరో వాహనాన్ని ఎదురుగా ఢీకొట్టింది. ప్రమాదంలో బొలెరోలో ఉన్న పది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని 108లో ములుగు జిల్లా హాస్పిటల్ కు తరలించారు.

పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అన్నారం గ్రామానికి చెందిన ధరావత్​భద్రు (45) చనిపోయినట్లు నిర్ధారించారు. గాయపడిన వణితి, భూక్య యాకు, కైక, నేహా తదితరులకు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. మృతుడి కుమారుడు నగేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ఫోన్ లో బాధితులత మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​బానోతు రవిచందర్​హాస్పిటల్ కు వచ్చి బాధితులను పరామర్శించారు.