న్యూఢిల్లీ, వెలుగు: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ‘సర్’(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరిట జరిగిన ఓటర్ల పేర్ల తొలగింపుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలని అభ్యర్థించారు. సర్‌కు సంబంధించిన నిర్ణయాలు, ఆదేశాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కనీసం 14 సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ ఇటీవల మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో ఈ పిటిషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద అడ్వకేట్ శైలేంద్ర మణి త్రిపాఠి నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, భారత ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేశ్ కుమార్, క్యాబినెట్ సెక్రటరీ, మనీశ్ గార్గ్, సీమా ఖన్నాలను ప్రతివాదులుగా చేర్చారు. శైలేంద్ర మణి తరపున అడ్వొకేట్ ఆన్ రికార్డ్ (ఏఓఆర్) చాంద్ ఖురేషీ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 32 కింద జ్ఞానేశ్ కుమార్‌తో పాటు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనీష్ గార్గ్, డైరెక్టర్ జనరల్ (ఐటీ) సీమా ఖన్నా, ఇతర బాధ్యులైన అధికారులపై ఫిర్యాదులు నమోదు చేసి ప్రాసిక్యూషన్ మొదలుపెట్టాలని పిటిషనర్ కోరారు. అంతేకాదు, మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండా జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు, మార్గదర్శకాలు, సాఫ్ట్‌వేర్‌లో చేసిన మార్పులన్నింటినీ రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించి రద్దు చేయాలని కోరారు.
సెక్షన్ 18 ప్రస్తావన
2023 నాటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టంలోని సెక్షన్ 18ను పిటిషన్‌లో ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సెక్షన్ ప్రకారం సీఈసీ, ఇతర ఎన్నికల కమిషనర్ల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తితే మెజారిటీ అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకోవాలని గుర్తు చేశారు. ఈ ఏడాది మేలో జరిగిన సమావేశంలో ఫారం–6లో మార్పులపై కమిషనర్లు వివేక్ జోషి, సుఖ్బీర్ సింగ్ సంధు అభ్యంతరం వ్యక్తం చేశారని పిటిషన్‌లో పొందుపరిచారు. 1960 నాటి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్‌కు అనుగుణంగా చట్టబద్ధమైన ఫారంలో మార్పులు చేయాలంటే సంబంధిత నిబంధనలను కూడా సవరించాల్సి ఉంటుందని ఈ ఇద్దరు కమిషనర్లు అభిప్రాయపడ్డారు.
అయినప్పటికీ, ‘ఈసీఐ నెట్’ పోర్టల్‌లోని ఫారం–6లో దరఖాస్తుదారు లేదా వారి బంధువులు గత ఎస్ఐఆర్ ఓటర్ల జాబితాలో ఉన్నారా అనే వివరాలను కోరే విధంగా సీఈసీ ఏకపక్ష నిర్ణయంతో మార్పులు చేశారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ మార్పును సంధు అనంతరం ‘‘అనధికారికం, చట్టవిరుద్ధం’’గా అభివర్ణించినట్టు పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఫారం–6లో అనుమతి లేకుండా మార్పులు చేయడం, ఓటర్ల డేటాబేస్‌లను కేంద్రీకరించడం, ‘ఈసీఐనెట్’ వ్యవస్థ ద్వారా అర్హులైన ఓటర్ల పేర్లను పునరుద్ధరించడంలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆరోపించారు. ఇదిలా ఉంటే, పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల చేర్పును సవాలు చేస్తూ ఎన్నికల సంఘం పేరుతో దాదాపు 16.10 లక్షల అప్పీళ్లు దాఖలైనట్టు పిటిషన్‌లో ప్రస్తావించారు. ఎన్నికల సంఘం పేరుతో అనధికారికంగా దాఖలైన ఈ అప్పీళ్లను రద్దు చేయడంతో పాటు, ఈ ఘటనలో బాధ్యులను గుర్తించాలని పిటిషనర్ కోరారు.
13 కోట్ల ఓటర్ల తొలగింపుపై సిట్ దర్యాప్తుకు పట్టు
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకంగా 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించారన్న తీవ్ర ఆరోపణలపై స్వతంత్ర న్యాయ విచారణ కమిషన్ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో కోరారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో, సైబర్ సెక్యూరిటీ, ఐటీ నిపుణుల సహకారంతో ఈ దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. ‘ఈసీఐ నెట్’, ‘ఈఆర్ఓ నెట్’ డేటాబేస్‌లపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, ఓటర్ల పేర్ల తొలగింపునకు దారితీసిన పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలించాలన్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు 2025 అక్టోబర్ 1 నుంచి ‘ఈసీఐ నెట్, ఈఆర్ఓ నెట్’లకు సంబంధించిన సర్వర్ లాగ్‌లు, డేటాబేస్‌లు, సమాచార మార్పిడులు, మెటాడేటాను భద్రపరచాలని పిటిషన్‌లో కోరారు.
