- ప్రజల్లోని అనుమానాలు నివృత్తి చేయాలి
- సర్ పై చిరాగ్, కుశ్వాహా, టీడీపీ ఎంపీ డిమాండ్
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై ఎన్నికల కమిషన్ తీరుపై ప్రతిపక్షాలు ఒత్తిడి పెంచుతున్న వేళ.. ఎన్డీయే శిబిరంలోని మిత్రపక్షాల నుంచి కూడా ఈసీ స్పష్టత ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. ఎల్‌జేపీ (రామ్‌విలాస్) చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, ఆర్‌ఎల్‌ఎం చీఫ్ ఉపేంద్ర కుశ్వాహా, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వేర్వేరుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు, అపోహలు తలెత్తకుండా ఈసీ మరింత స్పష్టంగా వివరణ ఇవ్వాలని చిరాగ్ పాశ్వాన్ కోరారు.
ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకం సన్నగిల్లడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించి నెలకొన్న గందరగోళంపై ఈసీ వెంటనే వివరణ ఇవ్వాలని ఉపేంద్ర కుశ్వాహా ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. అయితే ఎక్కడైనా ప్రశ్నలు తలెత్తినప్పుడు వాటిపై ఈసీ వివరణ ఇవ్వడం, పారదర్శకత పాటించడం చాలా అవసరమని పేర్కొన్నారు. ఇది ఎన్నికల సంస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
