న్యూఢిల్లీ: బల్క్ డ్రగ్స్ (మెడిసిన్స్) ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం కింద ఈ ఏడాది జూన్ నాటికి రూ.5,210.74 కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేంద్ర రసాయన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏపీఐలు, కీ స్టార్టింగ్ మెటీరియల్స్ తయారు చేసేందుకు 39 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఈ పథకం ద్వారా దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెరిగి దిగుమతుల భారం తగ్గింది.
ఆంధ్రప్రదేశ్ కాకినాడ సెజ్‌లో లిఫియస్ ఫార్మా రూ.2,270.05 కోట్ల ఖర్చుతో పెన్సిలిన్ జీ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో కిన్వాన్ సంస్థ క్లావులానిక్ యాసిడ్ తయారీ యూనిట్‌ను ప్రారంభించింది. ఆంధ్ర ఆర్గానిక్స్ సంస్థ సుల్ఫాడైజిన్, టెల్మిసార్టన్ తయారీ యూనిట్లను, గుజరాత్‌లో మేఘమణి సంస్థ పారా అమైనో ఫెనాల్ యూనిట్‌ను స్థాపించింది.
పంజాబ్‌లో సెంటియం ఫార్మా అటోవ్యాస్టాటిన్ యూనిట్‌ను నిర్మించింది. ఇదిలా ఉంటే, 2020లో ప్రారంభించిన వివిధ పీఎల్ఐ పథకాల కోసం ఈ ఏడాది జూన్ చివరి వరకు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం రూ.36,754 కోట్ల ప్రోత్సాహకాలను అందజేసింది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అత్యధికంగా నిధులు దక్కాయి.
