- లబ్ధిదారులకు చెక్కుల అందజేత
కోనరావుపేట, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల 30న జరిగే సీఎం రేవంత్ రెడ్డి భారీ సభకు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం కోనరావుపేటలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో విప్ పాల్గొని కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. రైతు వేదికలో 33 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. జిల్లాలో ఇప్పటికే సుమారు రూ.1,000 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మరో రూ.250 కోట్ల పనులు మంజూరైనట్లు చెప్పారు. కోనరావుపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరైనట్లు వివరించారు. ఎన్నికల్లో తాను నాలుగు సార్లు ఓడిపోయినా ప్రజల మధ్యే ఉంటూ చివరకు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. ఎమ్మెల్యే పదవిని కేవలం హోదాగా కాకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావించి పనిచేస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సత్యనారాయణ గౌడ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కె.ఎల్లయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మానుక సత్యం, సింగిల్ విండో చైర్మన్లు గంగాధర్, భాస్కర్ రావు, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.
