- జవాబు చెప్పలేక పారిపోయిన షరీఫ్
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న యునైటెడ్ నేషన్స్ (యూఎన్) ప్రధాన కార్యాలయం వద్ద పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఘోర అవమానం ఎదురయ్యింది. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక షరీఫ్ అక్కడి నుంచి పారిపోయారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) వార్షిక సమావేశాల సందర్భంగా షరీఫ్ శుక్రవారం యూఎన్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
అయితే, అందులోకి అడుగుపెట్టేముందు..‘ప్రధాన మంత్రి గారు..మీరు మీ దేశంలో టెర్రరిస్టులకు ఆశ్రయం కల్పించడం ఎప్పుడు మానుకుంటారు?’ అని షరీఫ్‌ను ఏఎన్ఐ వార్తా సంస్థకు చెందిన ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు.ఆ తర్వాత ఆయన బయటికి వస్తున్నప్పుడు కూడా.. “లష్కరే తోయిబా (ఎల్ఈటీ) చీఫ్ హాఫీజ్ సయీద్‌పై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు?” అని జర్నలిస్టులు అడిగారు. ఈ రెండు ప్రశ్నలు విన్న షరీఫ్ వాటికి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి సైలెంట్ గా వేగంగా వెళ్లిపోయారు.
కాగా.. గురువారం యూఎన్ వేదికగా పాకిస్తాన్ నిజస్వరూపాన్ని భారత్ బట్టబయలు చేసింది. భారత యువ డిప్లొమాట్ క్షితిజ్ త్యాగి మాట్లాడుతూ.. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదని అన్నారు. పక్క దేశాలపై అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతుందని, అంతర్జాతీయ వేదికలపై పనికిమాలిన డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయి, బయటి దేశాలు ఇచ్చే విరాళాలు (బెయిలవుట్లు), రుణాల మీద బతుకుతున్న పాకిస్తాన్.. ఇప్పటికైనా సొంత ప్రజల అభివృద్ధికి, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడానికి కష్టపడాలని సూచించారు.
