- పలు దేశాల ప్రతినిధుల వాకౌట్
- నిరసనల మధ్యే ప్రసంగం
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి వేదికగా శత్రుదేశాలతోపాటు మిత్రదేశాల తీరుపైనా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మండిపడ్డారు. ఇరాన్ నాయకుల నుంచి మొదలుకొని న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దానీ, మిత్ర దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, తుర్కియే వరకు అందరినీ విమర్శించారు. గురువారం యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘గత మూడేళ్లలో ఇజ్రాయెల్ సైనికులు ఏడు వైపులా యుద్ధం చేశారు.
ఇలా ఏడు వైపులా మూడేళ్లు పోరాడగల న్యూజెర్సీ సైజుగల వేరే దేశం ఏదైనా మీకు తెలుసా?’’ అని నెతన్యాహు ప్రశ్నించారు. ‘‘వారు మమ్మల్ని భూమి మీద నుంచి తుడిచిపెట్టడానికి ప్రయత్నించారు. పడిపోవడానికి బదులుగా, మా అమెరికన్ స్నేహితులతో కలిసి మేం వారందరినీ భారీ దెబ్బకొట్టాం. ఇరాన్ సైన్యాన్ని, దాని అణు స్థావరాలను ధ్వంసం చేశాం’’ అని చెప్పారు. ఇరాన్ కనుసన్నల్లో నడుస్తున్న హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్‌కు తుర్కియే కూడా మద్దతు ఇస్తోందని, ఎర్డోగన్ నియంత అని అన్నారు. తన ప్రసంగంలో భాగంగా ఆయన ఒక పేజర్ పరికరాన్ని చూపించారు.
ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా కార్యకర్తలపై ఇజ్రాయెల్ గతంలో జరిపిన ‘పేజర్’ ఆపరేషన్‌ను గుర్తుచేశారు. అయితే, నెతన్యాహు ప్రసంగానికి సభలో అనేక దేశాల ప్రతినిధులు కేకలతో నిరసనలు తెలిపారు. డజన్లకొద్దీ దేశాల రాయబారులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో నిరసనలు తెలుపుతున్నవారు, వాకౌట్ చేస్తున్నవారిపై నెతన్యాహు మండిపడ్డారు. ‘‘ఇంకెవరైనా నైతిక పిరికిపందలు ఉంటే.. ఇప్పుడే వెళ్లిపోండి..” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ యూదు వ్యతిరేకి అని విమర్శించారు. ‘‘మిస్టర్ మామ్దానీ, మీరు గతంలో మా దేశంపై దాడిని సమర్థించారు. ఇప్పుడు నన్ను ఇక్కడకు రాకుండా ఆపడానికి.. నన్ను మాట్లాడకుండా చేయడానికి ప్రయత్నించారు. కానీ మీరు నా గొంతు నొక్కలేరు” అని నెతన్యాహు అన్నారు.
