రాజీవ్ ఓటు హక్కునిస్తే..  లాక్కునేందుకు మోదీ కుట్రలు: ప్రధానిపై జైరామ్ రమేశ్ విమర్శలు

రాజీవ్ ఓటు హక్కునిస్తే..  లాక్కునేందుకు మోదీ కుట్రలు: ప్రధానిపై జైరామ్ రమేశ్ విమర్శలు

న్యూఢిల్లీ: దేశంలోని యువతకు ఓటు హక్కు కల్పించేందుకు 1988లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఓటింగ్ వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారని కాంగ్రెస్ పార్టీ గుర్తుచేసింది. అప్పట్లో రాజీవ్ గాంధీ జెన్ జీలకు ఓటు హక్కు ఇచ్చారు.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం జెన్ జీల ఓటు హక్కును లాగేసుకోవడమే లక్ష్యంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించింది. ఈమేరకు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

‘ఇది ఇద్దరు ప్రధానుల కథ. ఒక ప్రధాని (రాజీవ్ గాంధీ) ఆర్టికల్ 326ను సవరించి ఓటింగ్ వయస్సును తగ్గించారు. ఆనాడు యువతను సాధికారులను చేసిన ప్రధాని ఆయన. మరోవైపు, యువత ఆశలను, ఆకాంక్షలను వమ్ము చేసిన మరో ప్రధాని (మోదీ). జెన్ జీ యువకులు ఓటర్లుగా నమోదు కాకుండా అడ్డుకుంటున్నారు. 

2024 నుంచి స్పెషల్ సమ్మరీ రివిజన్స్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ (ఎస్ఎస్ఆర్) ప్రక్రియను నిలిపివేయడమే దీనికి నిదర్శనం. యువత భయంతోనే ఆయన ఈ చర్యలకు పాల్పడుతున్నారు’ అని జైరామ్​రమేశ్​ఆరోపించారు.