- మూడు చోట్ల నీట మునిగి ముగ్గురు, ఖైరతాబాద్‌లో వెహికల్ కిందపడి ఒకరు మృతి
హైదరాబాద్‌సిటీ/పంజాగుట్ట/కొత్తపల్లి/కొల్లాపూర్/కడెం, వెలుగు: వినాయక నిమజ్జన వేడుకల్లో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు చోట్ల అపశ్రుతి చోటుచేసుకున్నది. కరీంనగర్, నాగర్‌కర్నూలు, నిర్మల్ జిల్లాల్లో ముగ్గురు నీటిలో మునిగి చనిపోయారు. కరీంనగర్జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామానికి చెందిన తాండ్ర రుద్ర(18) మల్కాపూర్ క్రాస్ రోడ్డు వద్ద విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా.. ఎస్సారెస్పీ కెనాల్‌లో జారిపడ్డాడు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో కొట్టు కుపోయిన రుద్ర కోసం పోలీసులు, అధికారులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఎల్ఎండీ ప్రాంతంలో రుద్ర మృతదేహం దొరికింది. అతడి కుటుంబానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణ సాయంగా రూ.25 వేలు అందజేశారు. కాగా, సోమశిల వద్ద వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుం డగా హైదరాబాద్‌లోని ఉప్పుగూడకు చెందిన ఎస్. రాజు (37) కృష్ణనదిలో పడి చనిపోయాడు.
ఉప్పుగూడకు చెందిన 20 మంది యువకులు నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూరు మండలం సోమశిల దగ్గర కృష్ణానదిలో విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు తీసుకొచ్చారు. అయితే, రాజు నదిలో గల్లంతయ్యాడు. పోలీసులు గాలింపు చేపట్టి.. మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం డెడ్‌బాడీని పోస్టుమార్టానికి పంపించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట్ పంచాయతీ పరిధిలోని కుర్రగూడలో నీటమునిగి ఒకరు మృతి చెందారు. వినాయకుడిని నిమజ్జనం చేస్తుండగా.. కడెం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో చుంచు రమేశ్ (45) ప్రమాదవశాత్తు పడిపోయాడు. నిర్వాహకులు వెంటనే రమేశ్‌ను నీళ్లలో నుంచి బయటకు తీసినా.. అప్పటికే అతడు మృతిచెందాడు. రమేశ్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయక నిమజ్జన శోభాయాత్రలో ప్రమాదం చోటుచేసుకున్నది. 20 ఏండ్ల యువకుడు ప్రమాదవశాత్తూ వెహికల్ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు.
