అశ్వారావుపేట/ ములకలపల్లి/ దమ్మపేట, వెలుగు: క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా అశ్వారావుపేట క్రీడా ప్రాంగణంలో అక్టోబర్ 10 నుంచి 12 వరకు రాష్ట్రస్థాయి జూనియర్ అండర్-20 బాలికల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. శుక్రవారం క్యాంపు ఆఫీస్‌లో పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. యువతలో క్రీడలపై ఆసక్తి, శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి పెంపొందించడంలో కబడ్డీ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.
ప్రత్యామ్నాయ రహదారి పరిశీలన..
ములకలపల్లి మండలం రాజుపేట శివారులో పాములేరు వాగు వరదకు బ్రిడ్జి కూలిపోవడంతో పాల్వంచ– -దమ్మపేట మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కంపగూడెం క్రాస్‌రోడ్డు నుంచి ములకలపల్లి వరకు ఉన్న ప్రత్యామ్నాయ రహదారి పనులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిశీలించి ఆఫీసర్లకు సూచనలు చేశారు. అనంతరం పలు వినాయక మండపాల్లో పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. ములకలపల్లిలో బాధితురాలికి మంజూరైన సీఎంఆర్ చెక్కును పంపిణీ చేశారు.
అనంతరం దమ్మపేట మండలం కొడిశెలగూడెంలో సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే పరిశీలించారు. కాలువ అవతల ఉన్న పొలాలకు వెళ్లేందుకు రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు ఆఫీసర్లను కోరారు. జగ్గారం పంచాయతీ పరిధిలోని గుర్వాయిగూడెంలో టోర్నడో కారణంగా దెబ్బతిన్న జీడిమామిడి, పామాయిల్, పత్తి తోటలను ఎమ్మెల్యే పరిశీలించారు. నష్టపోయిన రైతులను పరామర్శించి, విపత్తు నిధుల ద్వారా నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
