- ఒక్కోలాట్లో 50 వేల మెట్రిక్ టన్నులు
- మొత్తం లక్షన్నర టన్నులకు యాక్షన్
- ఈనెల 28న బిడ్స్ ఓపెన్
- కొన్న రేటుకే అమ్మడం ద్వారా భారీగా లాస్
మంచిర్యాల, వెలుగు: గత యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన దొడ్డు వడ్లను ఈ యాక్షన్ ద్వారా అమ్మడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ గోడౌన్లు, రైస్ మిల్లుల్లో స్టాక్ చేసిన వడ్లను విక్రయించేందుకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ఇటీవల టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మంచిర్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని వడ్లను మూడు లాట్లు చేశారు. ఒక్కో లాట్లో 50 వేల మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం లక్షన్నర టన్నులు విక్రయించనున్నారు. మంచిర్యాల జిల్లాలోని 26 గోడౌన్లు, నిర్మల్ జిల్లాలోని 30 గోడౌన్లలో ఉన్న స్టాక్‌ను రెండు లాట్లు చేసి, మూడో లాట్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వడ్లను కూడా చేర్చారు. ఈనెల 28న బిడ్స్ ఓపెన్ చేయనున్నారు.
కొన్న రేటుకే అమ్మకం
రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ -ఏ వడ్లు క్వింటాల్‌కు రూ.2,389, గ్రేడ్- బికి రూ.2,369 చెల్లించి కొనుగోలు చేయగా, అదే రేటుకు విక్రయిస్తోంది. టెండర్లో క్వింటాల్‌కు రూ.2,689 రిజర్వ్ రేటు నిర్ణయించింది. అంతకంటే ఎక్కువ రేటు కోట్‌చేసిన బిడ్డర్లకు వడ్లను అప్పగించనుంది. ప్యాడీ టెండర్లో పెద్ద సంఖ్యలో మిల్లర్లు పాల్గొనే అవకాశం ఉన్నది. ఈ వడ్లను కొనుగోలు చేసి పెండింగ్సీఎమ్మార్ క్లియర్ చేయడానికి ముందుకొస్తారని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, ఏజెన్సీ కమీషన్లు, బ్యాగుల కొనుగోళ్లు, హమాలీ, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జీలు, గోడౌన్ల రెంట్, ఇతర ఖర్చులుకలుపుకుంటే క్వింటాల్‌కు రూ.3వేలు దాటుతుంది. కొన్న రేటుకే అమ్మడం వల్ల ప్రభుత్వానికి క్వింటాల్‌కు రూ.500లకు పైగా లాస్ వస్తుంది.
భారం దించుకునేందుకే...
రైతుల నుంచి సేకరించిన వడ్లను రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ గోడౌన్లు, రైస్ మిల్లుల్లో స్టోర్ చేశారు. ప్రభుత్వం పీడీఎస్ కింద సన్నబియ్యం పంపిణీ చేస్తున్నందున దొడ్డు వడ్లను మిల్లింగ్ చేసినా ఆ బియ్యాన్ని వినియోగించుకోలేని పరిస్థితి. మరోవైపు వానాకాలం సీజన్లో సేకరించే వడ్లను దాచేందుకు గోడౌన్ల కొరత ఏర్పడింది. ఈక్రమంలో దొడ్డు వడ్లను వదిలించుకోవడం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఇన్కమ్ రావడమే కాకుండా గోడౌన్లు ఖాళీ అవుతాయి. రెంట్ భారం కూడా తప్పుతుంది. ఈ కారణంగానే లాస్ వచ్చినప్పటికీ వడ్లను అమ్మడానికే సిద్ధపడింది. గత యాసంగి సీజన్లో మంచిర్యాల జిల్లాలో 1.80 లక్షల టన్నుల వడ్లను సేకరించారు. దాదాపు లక్ష మెట్రిక్ టన్నులను సీఎమ్మార్కోసం మిల్లులకు కేటాయించగా, మిగిలిన వడ్లను గోడౌన్లలో స్టాక్ చేశారు. ప్రస్తుతం జిల్లాలో 1,21,442 మెట్రిక్ టన్నుల ప్యాడీ నిల్వలు ఉన్నాయి.
