దాహంతో అల్లాడిపోయిన భక్తులు.. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన వేళ భక్తులకు చేదు అనుభవం

దాహంతో అల్లాడిపోయిన భక్తులు.. ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన వేళ భక్తులకు చేదు అనుభవం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్‌‌‌‌ మహాగణేశుడి శోభాయాత్ర ఘనంగా సాగగా.. తాగునీరు దొరక్క భక్తులు దాహంతో అల్లాడిపోయారు. ఎన్టీఆర్‌‌‌‌ మార్గ్‌‌‌‌లోని నిమజ్జన ప్రాంతం ఉదయం నుంచి జనసంద్రంగా మారింది. బడా గణేశుడిని వీక్షించేందుకు, నిమజ్జన ఘట్టాన్ని చూసేందుకు వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులను ఒక వైపునకు మాత్రమే అనుమతించారు.

సెక్రటేరియేట్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు బడా గణేశ్ నిమజ్జనం జరిగే ప్లేస్ లో పబ్లిక్ నిండిపోయారు. మరోవైపు ఉక్కపోతతో ఎండిపోయిన గొంతును తడుపుకుందామంటే ఎక్కడా నీళ్లు దొరకలేదు. తాగునీటి ప్యాకెట్లు ఎక్కడ ఉన్నాయో తెలియక చాలా మంది అయోమయానికి గురయ్యారు.

చాలా దూరం వెళ్లి మంచినీళ్లు తాగి వద్దామన్నా కనీసం అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. అధికారులు తాగునీటి ప్యాకెట్లు పెద్ద ఎత్తున తెచ్చినప్పటికీ, వాటిని సకాలంలో జనాలకు అందించేందుకు వలంటీర్లు గానీ, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో సమస్య తలెత్తింది. దీంతో దాహార్తిని తీర్చుకోలేక వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడ్డారు.