హైదరాబాద్ సిటీలో 2.18 లక్షల విగ్రహాల నిమజ్జనం : డీజీపీ సీవీ ఆనంద్‌‌

హైదరాబాద్ సిటీలో 2.18 లక్షల విగ్రహాల నిమజ్జనం : డీజీపీ సీవీ ఆనంద్‌‌
  •     రాష్ట్రవ్యాప్తంగా గణేశ్‌‌ పోర్టల్‌‌లో 1.24 లక్షల విగ్రహాలు
  •     శాంతియుతంగా సాగిన గణేశుడి శోభా యాత్రలు
  •      వివరాలు వెల్లడించిన డీజీపీ  

హైదరాబాద్‌‌,వెలుగు: హైదరాబాద్​లోని మూడు కార్పొరేషన్లు సీఎంసీ, ఎంఎంసీ, జీహెచ్ఎంసీ పరిధిలో గణేశ్ విగ్రహాల నిమజ్జనాలు వేగంగా సాగుతున్నాయి. సీఎంసీ పరిధిలో 1,35,000 విగ్రహాలకుగాను ఇప్పటికే లక్ష నిమజ్జనమయ్యాయి. ఎంఎంసీలో సుమారు 35,000 విగ్రహాలుండగా, ఇప్పటికే 18 వేలు నిమజ్జనం కాగా ఇక్కడ సాయంత్రానికల్లా నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం ఉంది. హుస్సేన్ సాగర్‌లో ఈరోజు ఇప్పటివరకు 8 వేల విగ్రహాలు నిమజ్జనం కాగా, ఇప్పటివరకు దాదాపు 40 వేల విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. ఉదయానికల్లా మరో 10 నుంచి 12 వేల విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కానున్నాయి. మొత్తంమీద జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు లక్షకుపైగా వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. 

కాగా, రాష్ట్రవ్యాప్తంగా గణేశ్‌‌ నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిశాయని డీజీపీ సీవీ ఆనంద్‌‌ తెలిపారు. పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుడు 1.15 లక్షల విగ్రహాలు నమోదుకాగా, ఈ ఏడాది గణేశ్‌‌ పోర్టల్‌‌లో 1.24 లక్షల విగ్రహాలు నమోదయ్యాయని వివరించారు. రిజిస్ట్రేషన్ అన్నీ కలిపి మొత్తం 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉండే అవకాశం ఉందన్నారు. శుక్రవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిమజ్జన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, నిమజ్జనాల వివరాలను డీజీపీ సీవీ ఆనంద్‌‌ వెల్లడించారు. గణేశ్‌‌ ఉత్సవాల సందర్భంగా గత పది రోజుల్లో 13 మంది మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎస్ఐ మృతి బాధాకరం

నిమజ్జన విధులకు హైదరాబాద్ వచ్చిన కొత్తగూడెం ఎఐ వెంకన్న మృతి బాధాకరమని సీవీ ఆనంద్‌‌ అన్నారు. సైబరాబాద్‌‌ పరిధిలోని పటాన్‌‌చెరులో ఆరుగురు మృతి చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఖైరతాబాద్‌‌లో శుక్రవారం ఒకరు మృతి చెందగా,  నిర్మల్‌‌లో గుండెపోటుతో ఒకరు మృతి చెందినట్టు చెప్పారు. డీజే శబ్దాల కారణంగా కూడా కొందరు మృతి చెందినట్టు పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా టీజీఎస్పీ, ఆర్‌‌ఏఎఫ్‌‌, ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌, ఆక్టోపస్‌‌ బలగాలుసహా మొత్తం 25 వేల మందికిపైగా పోలీసులను మోహరించినట్టు తెలిపారు.  కమాండ్‌‌ కంట్రోల్‌‌ కేంద్రం నుంచి పర్యవేక్షించినట్టు చెప్పారు.