- సీనియర్, జూనియర్ అసిస్టెంట్ సహా అటెండర్‌ను సస్పెండ్ చేసిన సూర్యాపేట కలెక్టర్
సూర్యాపేట, వెలుగు: రిటైర్ అయిన ఓ ఉద్యోగికి సంబంధించిన పెన్షన్ ప్రపోజల్స్ పంపించేందుకు లంచం డిమాండ్ చేయడంతో పాటు, ఫైల్ ను పక్కకు పెట్టిన సూర్యాపేట జిల్లాకు చెందిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. బాధితుడి ఫిర్యాదుతో విచారణ జరిపిన కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు అవినీతికి పాల్పడిన సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే... సూర్యాపేట జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖలో పనిచేసిన ఓ ఉద్యోగి మార్చిలో రిటైర్ అయ్యారు. ఆయనకు రావాల్సిన పెన్షన్ ప్రపోజల్స్ ను సంబంధిత ఆఫీస్ కు పంపకుండా సిబ్బంది ఆలస్యం చేస్తూ వచ్చారు. ఫైల్ క్లియర్ చేయాలంటే తమకు లంచం ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ రవి వర్మ, జూనియర్ అసిస్టెంట్ యాదగిరి, అటెండర్ రాము డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఫైల్ ను నెలల తరబడి పెండింగ్ లో పెట్టారు.
దీంతో సదరు రిటైర్ ఉద్యోగి కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకోవడంతో పాటు ఆధారాలతో సహా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. సీనియర్ అసిస్టెంట్ రవి వర్మ, జూనియర్ అసిస్టెంట్ యాదగిరి, అటెండర్ రాము కావాలనే ఫైల్ ను ఆలస్యం చేసినట్లు, లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలకు, రిటైర్డ్ ఉద్యోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించినా, డబ్బుల కోసం వేధించినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.
