డ్రగ్స్‌‌ నియంత్రణలో ఈగల్‌‌ దేశానికే ఆదర్శం : డీజీపీ సీవీ ఆనంద్‌‌

డ్రగ్స్‌‌ నియంత్రణలో ఈగల్‌‌ దేశానికే ఆదర్శం : డీజీపీ సీవీ ఆనంద్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: డ్రగ్స్‌‌ నియంత్రణలో తెలంగాణ పోలీసులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని డీజీపీ సీవీ ఆనంద్‌‌ అభినందించారు. 10 కీలక అంశాల్లో తెలంగాణ పోలీసులు ఆరింటిలో ముందంజలో నిలిచారని తెలిపారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఈగల్‌‌ డైరెక్టర్‌‌ సందీప్‌‌ శాండిల్యతో కలిసి ఈగల్‌‌ ఫోర్స్‌‌ పనితీరును సమీక్షించారు. మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీసుల కృషి దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని డీజీపీ పేర్కొన్నారు. డ్రగ్స్‌‌ నిర్మూలనకు ప్రభుత్వం పోలీసులకు పూర్తి స్వేచ్ఛ, సహకారం అందిస్తోందని తెలిపారు. 

‘నషాముక్తి తెలంగాణ–నషాముక్తి భారత్‌‌’ లక్ష్యంతో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. డ్రగ్స్‌‌ కేసుల్లో అరెస్టుల విషయంలో తెలంగాణ పోలీసులు గణనీయమైన పనితీరు కనబరిచారని అధికారులు డీజీపీకి వివరించారు. జాతీయస్థాయిలో ప్రతి కేసుకు సగటున 1.3 మంది అరెస్టు చేస్తుండగా.. తెలంగాణలో ఆ సంఖ్య 3.7గా ఉందని తెలిపారు. డ్రగ్స్‌‌ నెట్‌‌వర్క్‌‌పై లోతుగా దర్యాప్తు చేస్తూ, సంబంధిత వ్యక్తులపై సమగ్రంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. థాయిలాండ్‌‌, గోవా, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లి డ్రగ్స్‌‌ సరఫరా, రవాణా వ్యవస్థపై ఆధారాలు సేకరించి కేసులు నమోదు చేసినట్లు డీజీపీకి వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో విస్తరించిన నెట్‌‌వర్క్‌‌లపై సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.