సర్ ను రాహుల్ తప్పుబట్టడం హాస్యాస్పదం : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

సర్ ను రాహుల్ తప్పుబట్టడం హాస్యాస్పదం : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: ఈసీ, ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న రాద్ధాంతం చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ చరిత్ర మొత్తం రాజ్యాంగ సంస్థలను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడమేనని, అలాంటి పార్టీ నేడు రాజ్యాంగబద్ధంగ సాగుతున్న ప్రక్రియను తప్పుబట్టడం హాస్యాస్పదమన్నారు. 

ఈ మేరకు ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఎమర్జెన్సీ ఆకృత్యాలు, బలవంతపు కుటుంబ నియంత్రణ అమలుపై సాక్షాత్తూ షా కమిషన్ తప్పుబట్టిన నవీన్ చావ్లాను గతంలో ఎన్నికల కమిషనర్‌గా నియమించి తీవ్ర పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. తమ హయాంలో ఎన్నికల కమిషన్‌ను అడ్డగోలుగా వాడుకున్న కాంగ్రెస్‌కు నేడు స్వతంత్ర సంస్థలపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాహుల్ గాంధీకి కోర్టులు, న్యాయమూర్తులు, ఎన్నికల సంఘంపై ఏమాత్రం గౌరవం లేదని, తమకు వ్యతిరేకంగా నిర్ణయాలు వస్తే చాలు వ్యవస్థలను కించపరచడం ఆయనకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.