సత్తుపల్లి ట్రంక్ను త్వరగా పూర్తి చేయాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సత్తుపల్లి ట్రంక్ను త్వరగా పూర్తి చేయాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, వెలుగు: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా సత్తుపల్లి ప్రాంతానికి సాగు నీరు అందించేందుకు చేపట్టిన సత్తుపల్లి ట్రంక్​కెనాల్ కు సంబంధించి ప్యాకేజీ 9, 10, 11, 12​ పనులను వేగంగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. 

ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డిని కలిసి సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులపై చర్చించారు. భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ బిల్లులను ప్రాధాన్యతాక్రమంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తుమ్మల కోరారు. ప్యాకేజీ 9, 10 పనులను వచ్చే నెలాఖరు వరకు పూర్తి చేసి బేతుపల్లి రిజర్వాయర్​కు గోదావరి నీటిని అందించేలా చూడాలన్నారు.

ప్యాకేజీ 11, 12 పనులను వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రతిపాదించిన డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీలు 7,8కి భూసేకరణ చిక్కులు లేకుండా పైప్​లైన్ ​నెట్​వర్క్​ను ప్లాన్ చేయాలని కోరారు. ఆయిల్ పామ్​తో పాటు ఇతర వాణిజ్య పంటల సాగు విస్తృతంగా ఉన్నందున 2,500 ఎకరాల భూసేకరణ లేకుండా పైప్​లైన్ ​ఏర్పాటు చేయాలన్నారు. 

సీతారామ ప్రాజెక్టు కాల్వల పరిధిలో అందుబాటులో ఉన్న భూమిని వినియోగించుకొని సోలార్​ప్లాంట్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్​ను ప్రాజెక్టు పంప్​హౌస్ లకు వినియోగించే అవకాశంపై సమావేశంలో చర్చించారు. వారి వెంట కొత్తగూడెం జిల్లా ఇరిగేషన్​సీఈ శ్రీనివాస్​రెడ్డి ఉన్నారు.