కొత్త TPS ల ఏర్పాటుకు సర్కారు కసరత్తు

కొత్త TPS ల ఏర్పాటుకు సర్కారు కసరత్తు
  •     వచ్చే ఏడాదికి 93 స్కూళ్లు అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్ 
  •     నేడు హెడ్మాస్టర్లతో విద్యాశాఖ కీలక భేటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (టీపీఎస్) ఏర్పాటుకు సర్కారు కసరత్తు ప్రారంభించింది. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అత్యాధునిక వసతులు, నాణ్యమైన బోధన అందించడమే ధ్యేయంగా ఇప్పటికే హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 93 పబ్లిక్ స్కూళ్లను మంజూరు చేసింది. చిన్న సర్కారు స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లలోని విద్యార్థులను ఆకర్షించడంతో పాటు, బడుల్లో ఒకే గదిలో రెండు, మూడు తరగతులకు ఒకే టీచర్ పాఠాలు చెప్పే మల్టీ-గ్రేడ్ బోధన పద్ధతికి శాశ్వతంగా ముగింపు పలకడమే లక్ష్యంగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. 

ఏడాది నాటికి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను రెడీ చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయి నుంచి వసతుల సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఎంపిక చేసిన బడుల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్లు ఎన్ని అదనపు తరగతి గదులు నిర్మించాలి? విద్యార్థులకు, టీచర్లకు ఎంత మేరకు బెంచీలు, డెస్కులు, ఫర్నిచర్ అవసరమవుతుంది? అనే అంశాలపై సమగ్ర వివరాలను ఆరా తీస్తున్నారు. వీటితో పాటు తాగునీరు, బాలబాలికలకు వేర్వేరు టాయిలెట్లు, ప్రహరీ గోడల నిర్మాణం, ఎలక్ర్టిసిటీ లాంటి కనీస మౌలిక వసతుల స్థితిగతులపై స్కూళ్ల వారీగా రిపోర్టులను సిద్ధం చేస్తున్నారు. ఈ సివిల్ పనులతో పాటు మౌలిక వసతుల కల్పన బాధ్యతలను ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూఐడీసీ)కి అప్పగించారు.

ఈ నెల 26, 28 తేదీల్లో హెడ్మాస్టర్లతో  సమీక్ష

టీపీఎస్‌‌ల గ్రౌండింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 26, 28 తేదీల్లో హైదరాబాద్‌‌లోని ఎస్సీఈఆర్‌‌టీ ప్రాంగణంలోని గోదావరి ఆడిటోరియంలో ఎంపిక చేసిన స్కూళ్ల ప్రిన్సిపాళ్లు/హెడ్మాస్టర్లతో ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. తమ బడులకు అవసరమైన అదనపు తరగతి గదులు, ఫర్నిచర్, ఇతర అత్యవసర మౌలిక వసతులపై పక్కా లెక్కలతో ఈ సమావేశానికి హాజరుకావాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తాజాగా ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ఈడబ్ల్యూఐడీసీ అంచనా వివరాలను సిద్ధం చేసింది. ఈ రెంటింటికి కలిపి చెక్ చేసి.. ఫైనల్ డేటాను రెడీ చేయనున్నారు.