- ప్రధానిని ‘దేశద్రోహి’ అనడం రాహుల్ అసహనానికి పరాకాష్ఠ
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో వరుస ఓటములతో నైరాశ్యంలో కూరుకుపోయిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. అసహనంతో మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. దేశ ప్రజలు నమ్మి ఎన్నుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాను దేశద్రోహి అంటూ దూషించడం సరికాదన్నారు. తాము గెలిస్తేనే ప్రజాస్వామ్యం గెలిచినట్లు, ఇతరులు గెలిస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్లు కాంగ్రెస్ నేతలు చిత్రీకరిస్తున్నారని పేర్కొంటూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఒక పార్టీ గుర్తుపై గెలిచిన దానం నాగేందర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకుని, ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించగా.. ఆయనపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసిన రోజే రాహుల్ ప్రజాస్వామ్య పాఠాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని ప్రజా తీర్పును అపహాస్యం చేసిందని, అసలైన ఓట్ చోరీకి పాల్పడింది కాంగ్రెస్సేనని ఎద్దేవా చేశారు. ప్రధాని, హోంమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
