హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అణచివేత, దోపిడీ, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా నిలబడి పోరాడిన మహనీయురాలు ఐలమ్మ అని కొనియాడారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శమన్నారు. భూమి, భుక్తి, జీవన హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం అణగారిన వర్గాల్లో హక్కులపై చైతన్యం పెంచిందన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా పాలన ప్రభుత్వం బీసీలు, వెనుకబడిన వర్గాలు, పేదలు, మహిళల సంక్షేమానికి పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.
విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, సామాజిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. బీసీ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడంతో పాటు గురుకులాలు, హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. బీసీ మహిళలు, యువత ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, గౌరవం, న్యాయం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వీరనారి ఐలమ్మ చూపిన ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
