- అటెండ్ కానున్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్) ఆవిర్భవించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 27న హైదరాబాద్‌లో 80 వసంతాల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి. సదానందంగౌడ్, ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ తెలిపారు. నాగోల్‌లోని శుభం కన్వెన్షన్ హాల్లో జరిగే ఈ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క హాజరవుతారని పేర్కొన్నారు.
దేశానికి స్వాతంత్య్రం రాకముందే.. 1946లో ఆవిర్భవించిన ఎస్టీయూ, దేశంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన తొలి ఉపాధ్యాయ సంఘంగా చరిత్రను సొంతం చేసుకుందని నేతలు గుర్తుచేశారు. టీచర్ల వృత్తిపరమైన గౌరవాన్ని కాపాడడంతో పాటు సామాజిక బాధ్యతతో విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు.
