రాష్ట్ర బీజేపీలో సంస్థాగత మార్పులు

రాష్ట్ర బీజేపీలో సంస్థాగత మార్పులు
  •     స్టేట్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా మధుకర్, సహ కార్యదర్శిగా దశరథ్
  •     భాషా సమస్య, కేడర్‌‌తో గ్యాప్ వల్లే చంద్రశేఖర్ తివారీ పక్కకు
  •     హైదరాబాద్ కేంద్రంగా మధుకర్, వరంగల్ నుంచి దశరథ్ కార్యకలాపాలు 

హైదరాబాద్, వెలుగు: పార్టీని క్షేత్రస్థాయి నుంచి  పటిష్టం చేసేందుకు కీలకమైన సంస్థాగత మార్పులకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నూకల మధుకర్‌‌ను నియమించింది. సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శిగా దశరథ్‌‌ను కేటాయించింది. అయితే తాజా నియామకాలతో రాష్ట్ర కాషాయ దళంలో అంతర్గత చర్చ మొదలైంది. తెలంగాణ కేడర్‌‌ను ఎన్నికల దిశగా పరుగులు పెట్టించేందుకే స్థానిక భాష, సంస్కృతిపై పట్టున్న తెలుగు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇన్నాళ్లూ బీజేపీ సంస్థాగత వ్యవహారాలు చూసిన చంద్రశేఖర్ తివారీకి తెలుగు రాకపోవడం పార్టీకి పెద్ద మైనస్‌‌గా మారింది. 

స్థానిక నేతలు, క్షేత్రస్థాయి కార్యకర్తలతో ఆయన సరిగ్గా మమేకం కాలేకపోవడం, కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడడంతో కేడర్‌‌లో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే తివారీని పక్కనపెట్టి, స్థానిక నేతలతో ఈజీగా కలిసిపోయేలా ఇద్దరు తెలుగు వారిని రంగంలోకి దించారనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఏపీ బీజేపీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శిగా పనిచేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన నూకల మధుకర్​కు తెలంగాణ బాధ్యతలు కూడా అప్పగించారు. ఆయనతో పాటు కర్నాటక రాష్ట్రానికి చెందిన సహా ప్రధాన కార్యదర్శిగా దశరథ్  ను నియమించారు. ఆయనకూ తెలుగు భాష రావడంతో ఆయన్ని తెలంగాణకు కేటాయించినట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నారు. 

ఒకరు ఉత్తరానికి.. ఒకరు దక్షిణానికి..

హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ రాష్ట్రవ్యాప్త వ్యూహాలు, సమన్వయాన్ని మధుకర్ పర్యవేక్షించనున్నారు. వరంగల్ కేంద్రంగా దశరథ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. దక్షిణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు ఈ ఇద్దరు నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారనే ప్రచారం నడుస్తోంది. త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఖైరతాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక వీరి నాయకత్వానికి, సంస్థాగత సామర్థ్యానికి అగ్నిపరీక్షగా మారనున్నాయి. 

గతంలో ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌‌ లో పార్టీని  అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన  సునీల్ బన్సల్‌‌నే తెలంగాణ ఇన్​చార్జిగా మళ్లీ నియమించింది. ఆయనతో పాటు సహ ఇన్​చార్జీలుగా అభయ్ పాటిల్, రేఖా శర్మకు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర నేతల తీరు, స్థానిక రాజకీయ పరిస్థితులపై బన్సల్, అభయ్ పాటిల్‌‌కు పూర్తి అవగాహన ఉండటంతో.. వర్గపోరుకు చెక్ పడ్తుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.