మెదక్/తూప్రాన్, వెలుగు: సోషల్ మీడియా అకౌంట్లో ఫాలోవర్లను పెంచుకునేందుకు ఇద్దరు వ్యక్తులు మావోయిస్టుల అవతారం ఎత్తారు. మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు వదులుతూ పోలీసులను కంగారు పెట్టించారు. ఈ చర్యలకు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మెదక్ ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 21న రాత్రి మాస్క్ ధరించిన ఓ వ్యక్తి తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి లేఖతో కూడిన ఎర్ర వస్త్రాన్ని రిసెప్షన్ టేబుల్‌పై ఉంచి వెళ్లిపోయాడు.
బయట బైక్‌పై మరో వ్యక్తి వేచి ఉన్నాడు. అదే సమయంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా ఎర్ర వస్త్రాలు, చత్తీస్‌గఢ్‌లో 10 మంది మావోయిస్టులకు విధించిన ఉరిశిక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లేఖ ఉంచారు. తేలిగ్గా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అందులో హెచ్చరించారు. లేఖపై అలెగ్జాండర్, గణపతి పేర్లు ఉన్నాయి. గత నెల సీఎం రేవంత్‌రెడ్డి మేడారం పర్యటన సందర్భంగా కూడా మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ వెలుగులోకి రావడంతో ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు.
తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, డీఎస్పీ నరేందర్‌గౌడ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన బండ మధు, చింతకింది శ్రీధర్ లను నిందితులుగా గుర్తించారు. గురువారం రాత్రి నాగులపల్లి బ్రిడ్జి వద్ద వారిని అరెస్ట్ చేసి, బైక్, రెండు మొబైల్ ఫోన్లు, రెయిన్‌కోట్, శాలువా, పెన్నులను స్వాధీనం చేసుకున్నారు.
ట్రెండ్ అవ్వాలని..
ప్రధాన నిందితుడు బండ మధు హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసే అలవాటు ఉన్న అతడు.. తన ఖాతాలకు ఎక్కువ మంది ఫాలోవర్లు పెంచుకోవాలనుకున్నాడు. రీల్స్‌కు అధిక వ్యూస్ వస్తే ఆదాయం పొందవచ్చని భావించి.. ఏఐ సాయంతో మూడు మావోయిస్టు లేఖలను సిద్ధం చేశాడు. ఈ నెల 21న అర్ధరాత్రి శ్రీధర్ బైక్‌పై తూప్రాన్‌కు వచ్చి మున్సిపల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్‌లో లేఖలు పెట్టి.. మొబైల్‌ఫోన్‌లో వీడియో తీసుకున్నాడు. కేసును త్వరగా ఛేదించిన పోలీసులకు ఎస్పీ నగదు రివార్డులు అందజేశారు.
