- ప్రభుత్వం, కాళోజీ వర్సిటీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం అందించిన పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను ఏపీలో బీడీఎస్ పూర్తి చేసిన విద్యార్థికి తెలంగాణలో ఎండీఎస్ ప్రవేశాల్లో స్థానికత వర్తిస్తుందా లేదా అనే అంశంపై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. వరంగల్‌కు చెందిన వి.సాహిత్ ఏపీలోని అమలాపురం కోనసీమ డెంటల్ కాలేజీలో బీడీఎస్ పూర్తి చేశారు. తెలంగాణలో ఎండీఎస్ ప్రవేశానికి స్థానికత వర్తింపజేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే స్థానిక కోటా వర్తిస్తుందని, ఈ విషయంపై 2024 డిసెంబరులో హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్ పొందినంత మాత్రాన స్థానికత వర్తించదని పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది మాత్రం 2024లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 62లోని అంశాలను అప్పటి తీర్పులో పరిగణనలోకి తీసుకోలేదని, ఆ నిబంధనలను ప్రస్తుతం సవాలు చేస్తున్నామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
