న్యూఢిల్లీ: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సుల ప్రవేశాలకు సంబంధించి గరిష్ట వయో పరిమితి రూల్ ను ఎత్తివేసే అంశంపై తమ వైఖరిని తెలపాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీకి 22 ఏళ్లు, మూడేళ్ల కోర్సుకు 45 ఏళ్ల గరిష్ట వయసు పరిమితి విధిస్తూ గతంలో బీసీఐ తీసుకున్న నిర్ణయంపై 2017 మార్చిలోనే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ వయసు నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ మోహనాలతో కూడిన ధర్మాసనం విచారించింది. లా కోర్సుల్లో ప్రవేశాలకు కనీస అర్హతలను నిర్ణయించే అధికారాలున్నప్పటికీ, గరిష్ట వయో పరిమితి విధించే అధికారం బీసీఐకి ఉందా అని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు.
దీనిపై బీసీఐ స్పందిస్తూ.. ఐదేళ్ల లా కోర్సులు ఎక్కువ శాతం రెసిడెన్షియల్ కావడంతోనే వయో పరిమితి పెట్టామని, ఎక్కువ వయసున్న విద్యార్థులు నాన్-రెసిడెన్షియల్ అయిన మూడేళ్ల లా కోర్సును ఎంచుకోవచ్చని తెలిపింది. కాగా, కోర్సు రెసిడెన్షియల్ స్వభావం ఆధారంగా గరిష్ట వయసును నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని జస్టిస్ బాగ్చి ప్రశ్నించారు. అన్ని కోర్సులు రెసిడెన్షియల్ కావని, కలకత్తా యూనివర్సిటీ ఇందుకు ఉదాహరణ అని పేర్కొంటూ.. ఇది ప్రాతిపదిక కాబోదన్నారు. ఈ అంశంపై కోర్టే తగిన ఉత్తర్వులు ఇవ్వొచ్చని బీసీఐ తెలపడంతో తదుపరి విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది.
