ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి ఈడీ నోటీసులు

ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి ఈడీ నోటీసులు
  •     సాహితీ ఇన్‌‌ఫ్రాతో రూ.2.1 కోట్ల లింకులపై ఆరా
  •     ఈ నెల 27న హాజరుకావాలని ఆదేశం
  •     ఇప్పటికే సాహితి ఎండీ, మాజీ డైరెక్టర్ల విచారణ

హైదరాబాద్‌‌, వెలుగు: సాహితీ ఇన్‌‌ఫ్రా మనీలాండరింగ్ కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే  అరెకపూడి గాంధీకి ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌ ‌(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27 ఉదయం 11 గంటలకు హైదరాబాద్ బషీర్‌‌‌‌బాగ్‌‌లోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది. వ్యక్తిగత బ్యాంక్ లావాదేవీలతో పాటు కుటుంబ సభ్యుల ఆదాయ వనరుల వివరాలను అందించాలని సూచించింది. కాగా, సాహితీ ఇన్‌‌ఫ్రాకు సంబంధించి సిటీ సెంట్రల్ క్రైమ్‌‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. 

ప్రీ లాంచ్‌‌ పేరిట సాహితీ ఇన్‌‌ఫ్రా చేపట్టిన ప్రాజెక్టుల్లో మొదట రూ.248 కోట్ల మోసం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.- ఈడీ దర్యాప్తులో మాత్రం సుమారు రూ.842 కోట్లుకు పైగా మోసం జరిగినట్లు తేలింది. ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారుల నుంచి భారీగా సేకరించిన నిధులను సొంత, కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించింది.- సంస్థ ఎండీ బి.లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావు 2018–-2020 మధ్య రూ.50 కోట్లు నగదు రూపంలో తీసుకున్నట్లు ఆధారాలు సేకరించింది. మొత్తంగా- దాదాపు రూ.126 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఈడీ గుర్తించింది.- మొత్తం వ్యవహారంలో గతంలోనే రూ.161 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 56 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసింది.

సాహితీతో అరికపూడికి లింకులేంటి!

ఈ కేసులో నిందితులు సాహితీ ఎండీ బి.లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావును ఈడీ ఇప్పటికే విచారించింది. సంస్థ ఎండీ లక్ష్మీనారాయణను 2024 సెప్టెంబర్‌‌లో అరెస్ట్ చేసింది. సాహితీ ఇన్‌‌ఫ్రా ఆర్థిక లావాదేవీలు, లక్ష్మీనారాయణ వెల్లడించిన వివరాల ఆధారంగా అరికపూడి గాంధీతో రూ.2.1 కోట్లు లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇందుకు సంబంధించిన వివరాలను ఈడీ సేకరించింది. ఈ మేరకు అరికపూడి బ్యాంక్ ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేసింది. సాహితీతో గాంధీకి ఎలాంటి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, నిధులకు సరైన వ్యాపార కారణాలు ఉన్నాయా.. అనే కోణంలో విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ నెట్‌‌వర్క్‌‌తో సంబంధం ఉన్న ఆస్తులపై కూడా ఈడీ దృష్టి సారించింది.