హైదరాబాద్లో గణేశ్ నిమజ్జన వేడుకలు.. 24 గంటలూ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్లో గణేశ్ నిమజ్జన వేడుకలు.. 24 గంటలూ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీజీఎస్‌‌‌‌‌‌‌‌ఆర్టీసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నిమజ్జన ప్రక్రియలో పాల్గొనే ప్రజల సౌకర్యార్థం 24 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 700 ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది.

ముఖ్యంగా హుస్సేన్‌‌‌‌‌‌‌‌సాగర్‌‌‌‌‌‌‌‌ పరిసర ప్రాంతాల నుంచి సిటీలోని ప్రధాన మార్గాలకు నిరంతరాయంగా బస్సులు నడిచేలా చూశారు. ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జోనల్ ఆఫీసులో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ల కోసం 44 కీలక ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు, కంట్రోలర్లను నియమించారు.

ఖైరతాబాద్, లక్డీకాపూల్, కోటి, బషీర్‌‌‌‌‌‌‌‌బాగ్, ఇందిరా పార్క్, ఏఐఆర్ ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్టీసీ క్యాంపులను ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇందిరా పార్క్, వి.వి. విగ్రహం వద్ద ప్రత్యేక రిలీఫ్ వాహనాలను అందుబాటులో ఉంచారు. బస్సులకు ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసర రిపేర్ల కోసం పోలీస్ స్టేషన్ల వద్ద 113 మంది డ్రైవర్లు,  87 మంది మెకానిక్‌‌‌‌‌‌‌‌లను సిద్ధంగా ఉంచారు. 

ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు సిటీ , అంతర్రాష్ట్ర బస్సుల (ఏపీఎస్‌‌‌‌‌‌‌‌ఆర్టీసీ, కేఎస్‌‌‌‌‌‌‌‌ఆర్టీసీ) రూట్లను మళ్లించారు.  నిమజ్జనం శనివారం ఉదయం వరకు కొనసాగినా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేస్తోంది.