రాష్ట్రంలోని గ్రామాలకు 17 వేల కిలోమీటర్ల హ్యామ్ రోడ్లు.. ఎల్ నినో తట్టుకునేలా ఉపాధి పనులకు రూ.8 వేల కోట్లు

రాష్ట్రంలోని గ్రామాలకు 17 వేల కిలోమీటర్ల హ్యామ్ రోడ్లు.. ఎల్ నినో తట్టుకునేలా ఉపాధి పనులకు రూ.8 వేల కోట్లు
  •  జనాలకు తాగునీరు అందించాకే పంటపొలాలకు సాగునీరు
  •  ఈసారి ధాన్యం కొనుగోలు సెంటర్లలో 40 శాతం మహిళా సంఘాలకే
  •  పంచాయతీరాజ్‍, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క
  •  హనుమకొండ కలెక్టరేట్​లో ఉమ్మడి వరంగల్‍, ఖమ్మం జిల్లాల ఆఫీసర్లతో రివ్యూ

వరంగల్‍, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా 17 వేల కిలోమీటర్ల హ్యామ్‍ రోడ్లు వేయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. శాఖ స్పెషల్‍ సీఎస్‍ దాన కిషోర్‍, కమిషనర్‍ దివ్యదేవరాజన్‍, హనుమకొండ, వరంగల్‍ కలెక్టర్లు చాహత్‍ బాజ్‍పాయ్‍, సత్యశారదతో కలిసి శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‍లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల అధికారులతో ఎల్​నినో సన్నద్ధత, వీబీ జీ రామ్‍ జీ, ఆర్‍డబ్ల్యూఎస్‍ అండ్‍ హ్యామ్‍ రోడ్ల పనులపై సీతక్క రివ్యూ చేపట్టారు. 

అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యాలు లేకపోవడం బాధాకరమన్నారు. ఈ క్రమంలో గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రాల వరకు మూడు విడతల్లో హ్యామ్‍ రోడ్లు నిర్మిస్తామన్నారు. అక్టోబర్‍ 25 నుంచి ఈ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఎల్​నినో ప్రభావంతో రోజూ నల్లని మబ్బులు రావడం తప్ప వానలు పడట్లేదన్నారు. దీనిని ఎదుర్కునేలా వ్యవసాయ కూలీలకు ‘వీబీ జీరామ్‍ జీ’ ఉపాధి పథకంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.8 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా 370 రకాల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

 జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంకుడుగుంతలు, పంట కుంటలు తవ్వించడం ద్వారా గ్రౌండ్‍ వాటర్ పెంచడంతో పాటు నీటిని ఒడిసి పట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏడాది పాటు తాగునీటి కొరత లేకుండా నీటి నిల్వ ఉందన్నారు. రాబోయే రోజుల్లోనూ నీటి ఎద్దడి రాకుండా తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆపై రైతుల పంటలకు సాగునీరు అందిస్తామన్నారు. ఎల్‍నీనో ఎఫెక్ట్​ గురించి ఎప్పటినుంచో రైతులకు అవగాహన కల్పిస్తూ ఆరుతడి పంటలు వేయాలని సూచించినట్లు గుర్తుచేశారు. 

అన్ని జిల్లాల్లో అంగన్‍వాడీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు చేపడుతూ ప్రతి గ్రామంలో చెక్‍ డ్యాముల నిర్మాణాలు, బావులు తవ్వించేలా చొరవ తీసుకోనున్నట్లు చెప్పారు. రాబోయే పంట కొనుగోలు సీజన్‍లో ధాన్యం కొనుగోలు సెంటర్లలో 40 శాతం మహిళా సంఘాలకే కేటాయించడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు.  సమావేశంలో శాఖ స్పెషల్‍ ఆఫీసర్‍ శ్రీలక్ష్మి, మిషన్‍ భగీరథ ఈఎన్‍సీ కృపాకర్‍ రెడ్డి, పంచాయతీరాజ్‍ ఈఎన్‍సీ జగదీశ్వర్‍ తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు..

భూపాలపల్లి రూరల్/ ములుగు/ వెంకటాపూర్​(రామప్ప): అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జయశంకర్​భూపాలపల్లి జిల్లా పెద్దాపూర్ రైతు వేదికలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 15 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో 1,39,530 స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా 3,95,962 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 

మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం...

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నల్లకుంటలో రూ.1.80 కోట్ల పీఆర్‌‌‌‌‌‌‌‌ఆర్ నిధులతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. లక్ష్మీదేవిపేటలో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నిర్మూలన, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో మొక్క నాటారు. వ్యాసరచన, చిత్రలేఖన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.