ఎల్లంపల్లి నీటిని లిఫ్ట్చేసి కాళేశ్వరం రిజర్వాయర్లు నింపండి : హరీశ్రావు

ఎల్లంపల్లి నీటిని లిఫ్ట్చేసి కాళేశ్వరం రిజర్వాయర్లు నింపండి : హరీశ్రావు
  •     మంత్రి ఉత్తమ్​కు హరీశ్​రావు లేఖ

హైదరాబాద్, వెలుగు: ఎల్లంపల్లి నీటిని లిఫ్ట్​చేసి, కాళేశ్వరం రిజర్వాయర్లు నింపాలని రాష్ట్ర ప్రభుత్వానికి  ఎమ్మెల్యే హరీశ్‌‌రావు కోరారు. గోదావరిలో నీరు వృథాగా పోతున్నా.. జలాశయాలను నింపకుండా ప్రభుత్వం బురద రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ గోదావరిలో వరద ప్రవాహం ఉన్నదని.. ఆ నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. అన్నపూర్ణ, రంగనాయక సాగర్ రిజర్వాయర్లు పూర్తిగా డెడ్ స్టోరేజీకి చేరాయన్నారు. మల్లన్న సాగర్ నింపితే హైదరాబాద్ తాగునీటితో పాటు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూసీ ప్రాజెక్టుకు కూడా నీళ్లు ఇవ్వొచ్చన్నారు. 

ఎల్లంపల్లి వద్ద నీటిని ఎత్తిపోసి మిడ్ మానేరు ద్వారా ఈ రిజర్వాయర్లన్నింటినీ నింపితే 5 లక్షల ఎకరాల ఆయకట్టు సస్యశ్యామలమవుతుందన్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ప్రజల తాగు, సాగునీటి గోస తీరుతుందని  పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్వహణకు రంగనాయక సాగర్ నుంచి నీళ్లు ఇవ్వాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆ రిజర్వాయర్‌‌లో చుక్క నీరు లేక ఫ్యాక్టరీ నడవని దుస్థితి ఏర్పడిందన్నారు. పంట చేతికొచ్చిన పామాయిల్ రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఎల్‌‌నినోను సాకుగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దన్నారు. ఆన్–ఆఫ్ పద్ధతిలో నామమాత్రంగా కాకుండా, పూర్తిస్థాయిలో 24 గంటలూ అన్ని మోటార్లు నడిపించాలని డిమాండ్​చేశారు.