ఆధ్యాత్మికం: మహాభారతం శాంతిపర్వంలోని కథ..అడగకుండా తీసుకుంటే దొంగతనమే..

ఆధ్యాత్మికం: మహాభారతం శాంతిపర్వంలోని కథ..అడగకుండా తీసుకుంటే దొంగతనమే..

పరుల వస్తువులను, సంపదలను పరులకు సంబంధించిన దైనిననా అడగకుండా తీసుకుంటే అది దొంగతనమే అవుతుందని ధర్మశాస్త్రం చెబుతుంది.  సొంత అన్నదమ్మలు.. అక్కచెల్లెళ్లు.. ఎవరి నుంచైనా అనుమతి లేకుందా తీసుకోరాదని మహాభారతం చెబుతుంది.

శంఖుడు, లిఖితుడు ఇద్దరూ అన్నదమ్ములు. వీళ్లు మునులు. వీళ్లు ప్రాచీన భారతీయ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేశారు. వీళ్లకి సంబంధించిన కథ మహాభారతంలోని శాంతిపర్వంలో ఉంది. వీళ్ల కథ నీతి ప్రవర్తనకు ప్రతీకగా ప్రసిద్ధి చెందింది. ఈ సోదరులిద్దరు బాహుదా నదీ తీరంలో వేరువేరుగా ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు.

 ఒకరోజు లిఖితుడు తన అన్న అయిన శంఖుని ఆశ్రమానికి వెళ్లాడు. ఆ ఆశ్రమంలోని చెట్లన్నీ పండ్లతో నిండి ఉన్నాయి. లిఖితుడు వెళ్లిన సమయంలో అక్కడ శంఖుడు లేకపోవడంతో, ఆశ్రమంలోని తోటలో ఉన్న చెట్ల నుంచి కొన్ని పండ్లు కోసుకుని తిన్నాడు. శంఖుడు తిరిగి వచ్చిన తర్వాత జరిగినదంతా తెలుసుకుని, ‘అనుమతి లేకుండా ఇతరుల వస్తువును తీసుకుని తినడం దొంగతనం కిందకు వస్తుంది, కాబట్టి నువ్వు రాజదండనకు అర్హుడవు.. అన్నాడు.

 అన్నగారి మాట ప్రకారం లిఖితుడు సుద్యుమ్న మహారాజు దగ్గరకు వెళ్లాడు. ముని కుమారునికి శిక్ష విధించడానికి రాజు సంకోచించాడు. కాని స్వయంగా రాజు ధర్మాన్ని అతిక్రమించితే, రాజ్యంలో అధర్మం ఏర్పడుతుందని భావించాడు. పండ్లను చేతులతో కోశాడు కనుక, లిఖితుని రెండు చేతులను నరికించాడు. శిక్ష అనుభవించిన అనంతరం లిఖితుడు అన్న దగ్గరకు వచ్చి శిరస్సు వంచి నమస్కరించాడు.

 శంఖుని ఆదేశం ప్రకారం బాహుదా నదిలో స్నానం చేయగా, లిఖితునికి తిరిగి రెండు చేతులు వచ్చాయి. ఈ కథ అన్నదమ్ముల మధ్య ఉన్న ధర్మనిష్ఠను తెలియచేస్తుంది. అంతేకాదు.. సొంతవారైనా తప్పు చేస్తే శిక్షించాలనే నిష్పాక్షికతను, రాజధర్మ విశిష్టతను తెలియజేస్తుంది. వీరిద్దరూ కలిసి రచించిన ‘శంఖ – లిఖిత స్మ్మతి’ ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథాలలో ప్రముఖమైనది. 

అనగనగా ఒక ఊరిలో ఒక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలోని గురువులంతా విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచడం కోసం కఠినంగా ఉండేవారు. ఎప్పటిలాగే ఆ సంవత్సరం కూడా విద్యార్థులకు పరీక్షలు వచ్చాయి. అందరూ తల ఎత్తకుండా బుద్ధిగా పరీక్ష రాస్తున్నారు. 

ఒక విద్యార్థి మాత్రం తన ఎదురుగా ఉన్న విద్యార్థి పేపర్‌లోకి నుంచి యథాతథంగా తన పేపర్‌లో రాసేస్తున్నాడు. ఉపాధ్యాయుడు అదంతా గమనించాడు. విద్యార్థిని లేపి బయటకు తీసుకుని వచ్చి, ఆ రోజంతా రెండు చేతులూ తాడుతో కట్టుకుని ఉండాలని శాసించాడు. 

ఆ విద్యార్థి మారుమాటాడకుండా తాళ్లతో చేతులు కట్టేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆ విద్యార్థి ఉపాధ్యాయుడి పాదాల మీద పడి, తనను క్షమించమని, ఇంక ఎన్నడూ అటువంటి దొంగపని చేయనని చెప్పాడు. ఇతరుల పేపర్‌లోని అక్షరాలను దొంగతనం చేసినందుకు ఆ విద్యార్థిని శిక్షించాడు గురువు. ఇతరుల వస్తువులతోపాటు, ఇతరుల అక్షరాలను తీసుకోవడం కూడా దొంగతనమేనని బోధించాడు. 

అదేవిధంగా ఇతరుల చెట్లకు పూచిన పువ్వులను, కాసిన పండ్లను.. ఆ యజమాని అనుమతి లేకుండా కోసుకుంటే అది కూడా దొంగతనమేనని, అదే విధంగా ఇతరుల ఆలోచనలు తన ఆలోచనలుగా చెప్పడం కూడా దొంగతనమేనని చెప్తూ, భారతంలోని కథను వారికి వివరించాడు ఉపాధ్యాయుడు.

మహాభారతంలో ధర్మరాజు రాజసూయ యాగం చేసిన సందర్భంలో సంపదలన్నిటికీ దుర్యోధనుడిని రక్షణగా ఉంచాడు. ఆ సంపదలను చూసిన దుర్యోధనుడికి వాటి మీద ఆశ కలిగింది. ఎలాగైనా ఆ సంపదలను తన వశం చేసుకోవాలనుకున్నాడు. ఆ కారణంగానే శకునితో కలిసి కపట జూదం ఆడి, పాండవులను అడవులపాలు చేసి, ఆ సంపదలకు తాను రాజు అయ్యాడు. 

కాని ఆ సంపదలు కేవలం పదమూడు సంవత్సరాలు మాత్రమే తన దగ్గర ఉన్నాయి. కురుపాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఆ సంపదలతోపాటు తన బంధువులను, సోదరులను పోగొట్టుకున్నాడు. తన ప్రాణాలను కూడా వదులుకున్నాడు. దొంగతనం చేయడమే కాదు, చేయాలనే ఆలోచన కూడా మంచిది కాదని ధర్మశాస్త్రం చెప్తోంది.

- డా. పురాణపండ వైజయంతి–

గమనిక:  మీరూ లైఫ్​కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీ పత్రంతో పాటు [email protected] కి మెయిల్​ చేయండి.