UNGA వేదికపై పాక్‌‌‌‌ ప్రధాని ప్రగల్భాలు..ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే తీవ్ర పరిణామాలు.. భారత్‌‌‌‌ వార్నింగ్‌‌‌‌

UNGA వేదికపై పాక్‌‌‌‌ ప్రధాని ప్రగల్భాలు..ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే తీవ్ర పరిణామాలు.. భారత్‌‌‌‌ వార్నింగ్‌‌‌‌
  • ఆపరేషన్​ సిందూర్​లో భారత్‌‌‌‌ దాడులను తిప్పికొట్టినట్టు సొంత డబ్బా

న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (యూఎన్‌‌‌‌జీఏ) వేదికగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి భారత్‌‌‌‌పై అసత్య ప్రచారానికి తెరలేపారు. నిరుడు ఏప్రిల్ 22న పహల్గామ్‌‌‌‌లో 26 మంది పౌరులను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత సైన్యం మే 7న పాకిస్తాన్, పీఓకేలో ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. 

అయితే, ఈ అంశాన్ని ప్రస్తావించిన షరీఫ్.. తమ సైన్యం భారత దాడులను సమర్థంగా తిప్పికొట్టి, శత్రువుకు మర్చిపోలేని గుణపాఠం చెప్పిందని సొంత డబ్బా కొట్టుకున్నారు. షరీఫ్ ఈ ప్రగల్భాలు పలుకుతున్న క్షణంలోనే కెమెరా భారత ప్రతినిధి బృందంలోని దౌత్యవేత్త ఆర్. శ్రీనివాస్ వైపు మళ్లింది. ఆయన షరీఫ్ మాటలను కొట్టిపారేస్తూ తల అడ్డంగా ఊపుతూ, పెదవులపై వెటకారపు చిరునవ్వు చిందించారు. పాక్ ప్రధాని మాటల్లోని డొల్లతనాన్ని, భారత్‌‌‌‌ తిరస్కారాన్ని ఆ ఒక్క నవ్వు తేటతెల్లం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌‌‌‌లో చక్కర్లు కొడుతున్నది.

ట్రంప్‌‌‌‌కు పాక్‌‌‌‌ కృతజ్ఞతలు..  

భారత్-–పాక్ మధ్య యుద్ధాన్ని నిలువరించడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవ చూపారంటూ షరీఫ్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ సకాలంలో జోక్యం చేసుకొని లక్షలాది మంది ప్రాణాలను కాపాడారని చెప్పారు. ట్రంప్‌‌‌‌ ముందుచూపు గల నాయకుడంటూ ప్రశంసించారు.   

 భారత్ దిమ్మతిరిగే కౌంటర్

పాక్‌‌‌‌ ప్రధాని షరీఫ్ చేసిన వ్యాఖ్యలు, అబద్ధాలు, ద్వంద్వ వైఖరిపై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఒక కీలుబొమ్మ పాలనగా అభివర్ణించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. 

భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ పెటల్ గెహ్లాట్ ప్రసంగిస్తూ.. పాక్ తీరును ఎండగట్టారు. ‘‘సొంత ప్రజల నుంచే రక్షణ కోసం రాజధాని చుట్టూ కోటలు నిర్మించుకుంటున్న ఒక ప్రభుత్వం.. ప్రజాస్వామ్య హక్కులు, మానవతా విలువల గురించి నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది” అని ఎద్దేవా చేశారు. 

పాకిస్తాన్ ప్రభుత్వం ‘సైన్యం చేత, సైన్యం కోసం, సైన్యంతో నడిచే వ్యవస్థ’ అని ఆమె విమర్శించారు. కాగా, యూఎన్​లో షరీఫ్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్‌‌‌‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.