హైదరాబాద్ జీపీవో స్థాయిని తగ్గించొద్దు.. కేంద్ర మంత్రులకు అసదుద్దీన్ ఒవైసీ లేఖ

హైదరాబాద్ జీపీవో స్థాయిని తగ్గించొద్దు.. కేంద్ర మంత్రులకు అసదుద్దీన్ ఒవైసీ లేఖ
  • జీపీవో హోదా తగ్గింపు ప్రతిపాదనను విరమించుకోవాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ జనరల్ పోస్టాఫీస్ (జీపీవో) హోదాను తగ్గించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్లు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఈ ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని కోరుతూ కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు శనివారం ఆయన లేఖ రాశారు. హైదరాబాద్ జీపీవోను గ్రూప్ 'ఏ' నుంచి గ్రూప్ 'బీ'కి మార్చడంతోపాటు, హైదరాబాద్ సిటీ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విలీనం చేయాలని ఇటీవల వచ్చిన ప్రతిపాదన సరికాదంటూ ఒవైసీ తన లేఖలో ప్రస్తావించారు.

వందేండ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ సంస్థ హోదాను తగ్గించడం అన్యాయమని, ఇది ఏకపక్ష నిర్ణయమని అభిప్రాయపడ్డారు. జీపీవో ఉద్యోగుల నుంచి తనకు అందిన వినతిపత్రాన్ని మంత్రులకు పంపినట్లు తెలిపారు. ‘‘హైదరాబాద్ జీపీవో అత్యధిక పనిభారం కలిగిన ముఖ్యమైన సంస్థ. హైదరాబాద్ హెడ్ పోస్టాఫీస్ పరిధిలోని మొత్తం మెయిల్ కార్యకలాపాల్లో జీపీవో వాటా గణనీయంగా ఉంది. దీని డెలివరీ పరిధి నిరంతరం విస్తరిస్తోంది.

తెలంగాణలో ఏకైక ఫిలాటెలిక్ బ్యూరో (తపాలా స్టాంపుల సేకరణ, పోస్టల్ చరిత్ర పరిశోధన) ఇక్కడే ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రక సంస్థకు ఎంతో ప్రాధాన్యత ఉందని, లక్షలాది మందికి ఇది తపాలా సేవలు అందిస్తోందని గుర్తుచేశారు. ప్రజల ప్రయోజనాలు, సంస్థ వారసత్వ గుర్తింపును దృష్టిలో ఉంచుకుని కేంద్ర మంత్రులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జీపీవో హోదా తగ్గింపు, విలీన ప్రతిపాదనలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.