నీతికథ: నిజమైన పేదవాడు.. సాయం చేసిన జమీందారు..!

నీతికథ: నిజమైన పేదవాడు.. సాయం చేసిన జమీందారు..!

రత్నగిరి జమీందారు ఒకసారి తన జమీ ప్రాంతాన్నంతా చుట్టి వచ్చాడు. ఆ పర్యటనలో తన పాలనా ప్రాంతంలో పేదరికంఎక్కువగా ఉందని గమనించాడు. రాత్రింబవళ్లు ఆయన ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. 

అదేటంటే ధనికులనందరినీ సమావేశపరచి,‘‘నా ఏలుబడిలో ఉన్న ప్రాంతంలో పేదవాళ్లు అధికంగా ఉన్నారు. వారి పేదరికాన్ని పారదోలడానికి ప్రతి ఒక్కరూ ఒక పేదవాణ్ణి ఎంచుకుని అతనికి  చేతనయినంత సాయం చేయాలి. మీరేకాదు నేనూ అలానే చేస్తాను’’ అన్నాడు. అందరూ ధనికులూ జమీందారు మాట కాదనకుండా అలాగే అన్నారు. 

తమకు తెలిసినంతలో ఒక నిరుపేదను ఎంచుకుని అతనికి తగినంత సాయం చేయసాగారు. జమీందారు పొరుగు గ్రామంలో ఉన్న ఒక ధనికుణ్ణి ఎన్నుకుని అతనికి భారీ ఎత్తున సాయం చేయసాగాడు. ధనికులకు జమీందారు తత్వం బోధపడలేదు. వారందరు కూడబలుక్కుని జమీందారును కలిసి,‘‘అయ్యా! మీరు చేస్తున్నదేమిటో అర్థం కావడంలేదు. మమ్మల్నేమో పేదలకు సాయం చేయమన్నారు. మీరేమో సంపన్నుడికి సాయం చేస్తున్నారు” అన్నారు. 

దానికి జమీందారు నవ్వి, ‘‘అదా! మీ సందేహం. నేను పర్యటనలో పొరుగు గ్రామంలో ఉన్న మణిగుప్తుడ్ని గురించి ఆ గ్రామస్థులు పొగుడుతుండడం విన్నాను. దానధర్మాల్లో ఆయనది ఎముక లేని చేయి అనుకుంటుండటం గమనించాను. 

నేను మణిగుప్తుడ్ని పిలిచి’’, అంతలా దానధర్మాలు చేయడానికి కారణం ఏమిటి?” అని అడిగాను. 
దానికి ఆయన సమాధానంగా ‘‘నేను పూటగడవడానికి ఇబ్బందిగా ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. ముందు చిన్న, చిన్న వ్యాపారాలు చేశాను. తరువాత పెద్ద ఎత్తున వ్యాపారం చేసి కాలం కలిసొచ్చి ధనవంతుడినయ్యాను.

 అయినా నా గతజీవితం,పేదరికంలో అనుభవించిన కష్టాలు మరువలేదు. నేను ఇప్పటికీ మానసికంగా పేదవాడినే. పేదలనాదుకోవడమే నా పని.. అందుకే నా సంపాదనలో కొంత భాగం దానధర్మాలకే ఉపయోగిస్తాను’’ అన్నాడు. ‘‘అతను కోట్లకు పడగలెత్తినా మానసికంగా పేదవాడినే అన్నమాటలు నాకు నచ్చాయి. అందుకే అతనికే ఆర్థికంగా నిధులందిస్తున్నాను. అతనూ నిజాయితీగా ఆ ధనాన్ని పేదల బాగుకోసం ఉపయోగిస్తున్నాడు.

 గతజీవితంలోని పేదరికాన్ని మరవనివాడే నా దృష్టిలో నిజమైన పేదవాడు. ఎందుకంటే సామాన్యంగా పేదరికం నుంచి సంపన్నులుగా ఎదిగిన కొంతమంది తమ పాతజీవితాన్ని మరిచి పేదలను చిన్నచూపు చూస్తుంటారు’’ అన్నాడు జమీందారు. ఆయన సునిశిత మేధాశక్తికి ధనికులందరూ ఆనందించారు. తరువాతి కాలంలో మణిగుప్తుడ్ని ఆదర్శంగా తీసుకుని తమకున్నంతలో దానధర్మాలు చేయడం కొనసాగించారు.

- డా. గంగిశెట్టి శివకుమార్

గమనిక:మీరూ లైఫ్​కి పిల్లల కథలుపంపాలి అనుకుంటున్నారా? అయితే..కథను హామీ పత్రంతో పాటు  [email protected] కి మెయిల్​ చేయండి.