- టెలికం ఆపరేటర్ ఎయిర్టెల్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మనదేశంతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్నకొద్దీ, సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయని ఎయిర్టెల్ తెలిపింది. ఐ4సీ డేటా ప్రకారం.. గత ఆరేళ్లలో ఆన్‌లైన్ మోసాల వల్ల భారతీయులు రూ.52,976 కోట్లకు పైగా నష్టపోయారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఏఐ ఆధారిత సేఫ్ నెట్‌వర్క్ సొల్యూషన్స్‌ను వాడుతున్నామని ఎయిర్టెల్ పేర్కొంది.
ఈ వ్యవస్థ ద్వారా గత సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు 9,840 కోట్లు స్పామ్ కాల్స్, 440 కోట్ల స్పామ్ మెసేజ్‌లను తన నెట్‌వర్క్‌లో ఎయిర్టెల్ గుర్తించింది. ఆన్‌లైన్ మోసాలను అడ్డుకోవడానికి కంపెనీ ఓటీపీ రక్షణను ఏర్పాటు చేసింది. 16.2 లక్షలకు పైగా హానికర లింక్స్‌ను బ్లాక్ చేసింది.
నకిలీ బ్యాంకింగ్, కస్టమర్ కేర్ మోసాలను నివారించడానికి వ్యాపార సంస్థల అసలు పేర్లను చూపించే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. వినియోగదారులు ఎలాంటి అదనపు యాప్‌లను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ భద్రతా వ్యవస్థ పనిచేస్తుందని ఎయిర్టెల్ తెలిపింది.
