యాదాద్రి జిల్లా బీబీనగర్ రామలింగేశ్వరస్వామి ఆలయ భూములపై పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

యాదాద్రి జిల్లా బీబీనగర్ రామలింగేశ్వరస్వామి ఆలయ భూములపై పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్‌‌, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌‌ మండలం చినరావులపల్లిలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన సుమారు 40 ఎకరాల భూమి యాజమాన్య హక్కులను సివిల్‌‌ కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.

రెవెన్యూ రికార్డుల్లో అనుభవదారుగా పేరు నమోదైనంత మాత్రాన యాజమాన్య హక్కులు రావని పేర్కొంది. వివిధ సర్వే నంబర్లలోని భూములపై దేవాదాయశాఖ ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హరికీర్తి ఆంజనేయులు, మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌‌ జీఎం.మొహియుద్దీన్‌‌ విచారణ చేపట్టారు.

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు 1955=56, 1957=58 వరకు పహాణీలో తమ తాత పట్టాదారుగా ఉన్నారని వాదించగా.. దేవాదాయశాఖ తరఫున 1958=59 నుంచి ఆలయమే పట్టాదారుగా ఉందని, పిటిషనర్లు అనుభవదారులుగా మాత్రమే ఉన్నారని తెలిపారు. రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి.. పట్టాదారు, అనుభవదారు కాలంలలో ఉన్న వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

భూములను పిటిషనర్లు అనుభవిస్తున్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నప్పటికీ, వాటి ఆధారంగా యాజమాన్య హక్కులు నిర్ధారించలేమన్నారు. ట్రైబ్యునల్‌‌ పిటిషనర్లకు నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకున్న తర్వాతే ఉత్తర్వులు జారీ చేసిందని, అందువల్ల సహజ న్యాయసూత్రాల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేశారు.

ట్రైబ్యునల్‌‌ తన పరిధిని దాటి ఏకపక్షంగా లేదా చట్టవిరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేసినప్పుడు మాత్రమే న్యాయసమీక్షకు అవకాశం ఉంటుందని, ప్రస్తుత కేసులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్లను కొట్టివేశారు.