వరంగల్ సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ పనుల్లో వేగం పెంచండి: సీఎంఓ స్పెషల్‍ ఆఫీసర్లు

వరంగల్ సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ పనుల్లో వేగం పెంచండి: సీఎంఓ స్పెషల్‍ ఆఫీసర్లు
  • నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలి
  • రాష్ట్ర స్పెషల్‍ ఆఫీసర్లు వికాస్‍ రాజ్‍, శ్రీధర్‍, మాణిక్‍ రాజ్‍, గౌరవ్‍ ఉప్పల్‍ ఆదేశాలు

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ సెంట్రల్‍ జైల్‍ స్థలంలో నిర్మిస్తున్న సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ పనులపై జిల్లా ఉన్నతాధికారులు స్పెషల్‍ ఫోకస్‍ పెట్టాలని సీఎంఓ స్పెషల్‍ ఆఫీసర్లు ఆదేశించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‍ రాజ్‍, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎన్‍.శ్రీధర్‍, కార్యదర్శి కె.మాణిక్‍ రాజ్‍, ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్‍ గౌరవ్‍ ఉప్పల్‍ శుక్రవారం గ్రేటర్‍ వరంగల్ లో పర్యటించారు.

సెంట్రల్‍ జైల్‍ స్థలంలో నిర్మిస్తున్న సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ను వరంగల్‍, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, చాహత్‍ బాజ్‍పాయ్‍తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ఇప్పటివరకు ఏయే పనులు ఎక్కడివరకు వచ్చాయో తెలుసుకున్నారు. 

అనంతరం వారు మాట్లాడుతూ.. హాస్పిటల్‍ పనులను సకాలంలో ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. సరైన నాణ్యతాప్రమాణాలను పాటించేలా పనులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.