- ఒక్క 23, 24వ తేదీల్లోనే భారీ వర్షాలు
- గోదావరి బేసిన్ప్రాజెక్టులకు స్వల్ప వరద నమోదు
- నేడు 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం అంతంతే కనిపించింది. ఐఎండీ రెడ్అలర్ట్, ఆరెంజ్అలర్ట్ అని హెచ్చరికలు ఇచ్చినా.. ఎక్కడా పెద్దగా ప్రభావం కనిపించలేదు. ఒక్క 23, 24వ తేదీల్లో మాత్రమే పది జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడ్డాయి.
తీవ్ర వాయుగుండంతో అత్యంత భారీ వర్షాలు పడతాయని 22, 23వ తేదీలకు రెడ్అలర్ట్ జారీ చేసినా.. అంత భారీ వర్షాలు మాత్రం పడలేదు. దాని ప్రభావంతో కురిసిన అత్యధిక వర్షపాతం 13 సెంటీమీటర్లే కావడం గమనార్హం.
ఇటు 22వ తేదీన ఒక్క సంగారెడ్డి జిల్లాలో మాత్రమే భారీ వర్షం కురవగా.. మరో నాలుగైదు జిల్లాల్లో మాత్రమే మోస్తరు వానలు పడ్డాయి. 24న ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు మినహా మిగతా జిల్లాల్లో కనీసం 6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా రికార్డు కాలేదు. శుక్రవారం తూర్పు తెలంగాణలోని రెండు మూడు జిల్లాల్లో మోస్తరు వానలు మినహా ఎక్కడా చినుకు జాడ కనిపించలేదు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెద్దంపేటలో అత్యధికంగా 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా ధర్మవరంలో 5 సెంటీమీటర్లు, కన్నాయిగూడెంలో 4.6, జయశంకర్ జిల్లా ముత్తారం మహదేవ్‌పూర్‌లో 3.5, సర్వాయిపేటలో 3.4, మంచిర్యాల జిల్లా నీల్వాయిలో 3.4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 2.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
ఇటు హైదరాబాద్‌లోనూ తీవ్రవాయుగుండం ప్రభావం కనిపించలేదు. కనీసం ఒక్క భారీ వర్షం కూడా పడలేదు. కాగా, రాష్ట్రంలో శనివారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని ఐఎండీ వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి వంటి 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఎల్లంపల్లికి 13 వేల క్యూసెక్కులు
స్థానికంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు స్వల్ప వరద ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 13 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అంతే నీటిని వదులుతున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టులో 20.18 టీఎంసీలకుగానూ.. 20.09 టీఎంసీల నిల్వ ఉన్నది. మిడ్‌మానేరు ప్రాజెక్టుకు 11,750 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 27.55 టీఎంసీలకుగానూ 24.85 టీఎంసీల స్టోరేజ్ ఉంది.
మిడ్‌మానేరు నుంచి ఎల్ఎండీకి పది వేల క్యూసెక్కుల నీటిని వదులుతుండగా.. అంతే ఇన్ఫ్లోస్నమోదవుతున్నాయి. కాగా, కర్నాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు 10,378 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. కెనాల్స్ ద్వారా 10,832 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
జూరాలకు 7600 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 9.66 టీఎంసీలకుగానూ 9.5 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ప్రాజెక్టు నుంచి ఎడమ, కుడి కాల్వలు, భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు లిఫ్టుల నుంచి 5800 క్యూసెక్కుల నీటిని పంటల కోసం విడుదల చేస్తున్నారు.
