ప్రస్తుత ఎల్‌నినో ప్రభావిత లోటు వర్షపాతం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. తొలకరి జల్లులతో మురిసిపోయి ఖరీఫ్‌లో అడుగుపెట్టిన రైతులకు ప్రస్తుతం తీవ్ర నిరాశే ఎదురవుతోంది. దుక్కి దున్నడం నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కలుపు తీయడం వరకు ఇప్పటికే రైతులు దాదాపు 60 శాతం వరకు పెట్టుబడి పెట్టారు.
ఇక రైతుల ముందున్న ఆలోచన ఒక్కటే.. పంటను కాపాడుకోవడం ఎలా? ఒకసారి క్షేత్రస్థాయిలో రైతాంగానికి కావాల్సింది కరెంటా? లేక నీళ్లా? అని పరిశీలిస్తే కచ్చితంగా రైతులకు కావాల్సింది నీళ్లే. నీటి లభ్యతను వెలికితీయడానికి విద్యుత్ అవసరం. నీటి లభ్యతే విద్యుత్ వినియోగానికి దిశానిర్దేశం. గురుత్వాకర్షణ (గ్రావిటీ) ద్వారా అందే నీటిని మినహాయిస్తే, మిగిలిన నీటి లభ్యతలో ఎక్కువ భాగం విద్యుత్ ఆధారితమే.
సెప్టెంబర్ మూడోవారం నాటికి రాష్ట్రంలో 20 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 15 జిల్లాల్లో సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదుకాగా, 18 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలను పరిశీలిస్తే, గత ఏడాది సెప్టెంబర్ మూడో వారానికి 876 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, ప్రస్తుతం 473 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.
భూగర్భ జలాల నీటి మట్టం సగటు 7.87 మీటర్లకు పడిపోయింది. ఈ లోటు వర్షపాతం కారణంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కూడా తగ్గింది. సాధారణంగా 132.38 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుండగా, ప్రస్తుతం 125.62 లక్షల ఎకరాల్లో అంటే సుమారు 95 శాతం విస్తీర్ణంలో మాత్రమే సాగు జరుగుతోంది.
గత ఏడాదితో పోలిస్తే ప్రధాన పంటల సాగు విస్తీర్ణాన్ని పరిశీలిస్తే పత్తి సాగు సాధారణ స్థాయిలో ఉండగా, వరిసాగు విస్తీర్ణం 14 శాతం, మొక్కజొన్న సాగు విస్తీర్ణం 4 శాతం తగ్గింది.
దక్షిణాదిలో నమోదవుతున్న గరిష్ట డిమాండ్
సాధారణంగా రాష్ట్ర విద్యుత్ గరిష్ట డిమాండ్ మార్చ్, ఏప్రిల్ నెలలో నమోదవుతుంది. కానీ దక్షిణ భారతంలో సెప్టెంబర్ 9న రాష్ట్ర విద్యుత్ చరిత్రలో 19,543 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. అలాగే తమిళనాడులో అదే రోజు 21000 మెగావాట్లు, సెప్టెంబర్ 11న కర్నాటకలో 20094 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది.
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తూ, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలను పూర్తి సామర్థ్యంతో నడిపిస్తూ, అవసరమైన విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, వ్యవసాయ రంగంతో సహా అన్ని రంగాల విద్యుత్ అవసరాలను తీరుస్తూ వస్తోంది విద్యుత్ శాఖ.
రాష్ట్రంలో విద్యుత్ శాఖ రైతాంగంతోపాటు అన్ని వర్గాలకు, రంగాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ను కొనుగోలు చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దీనికి విపరీతంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండే ప్రధాన కారణం.
ఎల్‌నినో ప్రభావం
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షపాత లోటుతో వాతావరణ సరళి మారిపోయింది. రోజూ సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఫ్యాన్లు, కూలర్లు, ఎయిర్ కండిషనర్లు వినియోగించడం వల్ల గృహ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. మరోవైపు భారీ వర్షాలు లేకపోవడంతో నేల దాహం కూడా పూర్తిగా తీరడం లేదు.
మండే ఎండలతో భూమిలో ఉన్న కాసింత తేమ కూడా ఆరిపోతుండటంతో భూమి మరింత నీటిని పీల్చుకుంటుంది. భూమిలో తేమ లేకపోవడంతో సాధారణంగా పారే నీటి ప్రవాహం కంటే ఎక్కువ నీటిని నేలలోకి తీసుకుంటుంది. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.
ప్రస్తుత అసాధారణ వాతావరణ పరిస్థితుల్లో పంటలను కాపాడుకోవడానికి సాధారణంగా వర్షపు నీటిపై ఆధారపడాల్సిన ఖరీఫ్ సీజన్‌లో కూడా బోర్లు, బావులు, కాలువల నీటిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రస్తుత పరిస్థితులు ప్రతి రైతులోనూ నీటి అవసరాన్ని పెంచుతున్నాయి. దీంతో రైతులు తమ పంటలకు అవసరమైన నీటిని అందించేందుకు విద్యుత్ ఆధారిత నీటి వెలికితీత మోటార్లపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది.
దీంతో అధిక లోడ్ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, వాటి పరిధిలోని చివరి రైతులకు లో-వోల్టేజ్ సమస్యలు రావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకవైపు గృహ విద్యుత్ వినియోగం, మరోవైపు వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరుగుతూ రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్‌కు చేరుకుంటోంది.
నీటి, విద్యుత్ ప్రణాళికలు అవసరం
ఈ అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవడానికి అందరి సహకారం అవసరం. గ్రామస్థాయిలో నీటి, విద్యుత్ ప్రణాళికలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో రైతులు, గ్రామ పాలన అధికారులు, యువత, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలి.
నీటి లభ్యతను పరిశీలించి, దాని ఆధారంగా వివిధ ప్రాంతాలను విభజించి, నీటి, విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించే ప్రయత్నం చేయాలి. రైతులను సూక్ష్మ సేద్యం వైపు ప్రోత్సహించాలి. పార్టీలకతీతంగా రాజకీయ అభిప్రాయాలను పక్కనపెట్టి, నిరంతరం అందుబాటులో ఉండే విద్యుత్‌ను నీటి లభ్యతకు అనుగుణంగా సమర్థవంతంగా వినియోగించుకునే ప్రణాళికలను రూపొందించడంలో ముందడుగు వేయాలి.
నీటిని సమర్థవంతంగా వినియోగించగలిగితే, విద్యుత్‌ను కూడా అంతే సమర్థవంతంగా వినియోగించగలుగుతాం. రాజకీయాలకు అతీతంగా ప్రకృతి విపత్తుగా వచ్చిన ఎల్‌నినో ప్రభావాన్ని, ఒత్తిడిని సమష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.
- బైరబోయిన వెంకటేశ్వర్లు,తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అసిస్టెంట్ ,ఇంజినీర్ల సంఘం
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
