- ఉప ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం కాంగ్రెస్ కసరత్తు
- సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు
- ఎలాగైనా ఈసారి పాగా వేయాలని ప్రయత్నిస్తున్న కమలం
- కాంగ్రెస్ పార్టీ టికెట్ దాదాపు దానం నాగేందర్‌కే ఖరారు
- అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బీఆర్ఎస్, బీజేపీ
- నియోజకవర్గంలో 50 వరకు బస్తీలు, మురికివాడలు
- విజేతను నిర్ణయించేది బస్తీ వాసుల ఓట్లే
హైదరాబాద్, వెలుగు: ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు కోసం అన్ని పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సర్వశక్తులు కూడదీసుకునే పనిలో పడ్డాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మూడో ఉప ఎన్నిక ఇది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్.. ఖైరతాబాద్ ను కూడా కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇదివరకే రెండు బీఆర్ఎస్ సీట్లలో పాగా వేయగా.. ఇప్పుడు మూడో సీటును కూడా దక్కించుకుని గులాబీ శిబిరానికి సవాల్ విసరాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
ఖైరతాబాద్‌లో 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడంతో ఫిరాయింపు చట్టం కింద అనర్హత వేటుకు గురయ్యారు. ఉప ఎన్నికలో ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో దానం గెలుపుపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. మళ్లీ గెలుపు తనదేనని దానం ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపు ప్రభావం ఏ మాత్రం ఉండదని, ఎల్లప్పుడు జనం మధ్య ఉండే తనను మళ్లీ ఆదరిస్తారని చెబుతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తనను గెలిపిస్తాయన్న భరోసాతో ఉన్నారు.
అభ్యర్థుల వేటలో బీఆర్ఎస్, బీజేపీ..
సిట్టింగ్ సీటును ఎలాగైనా సరే దక్కించుకునేందుకు బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అనర్హత తీర్పు వచ్చిన వెంటనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి ఉప ఎన్నికపై చర్చించారు. అభ్యర్థి ఖరారు, ఎన్నికల వ్యూహాల గురించి మాట్లాడారు. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ సీనియర్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. సాయికిరణ్ వైపే బీఆర్ఎస్ మొగ్గు చూపిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఆయన సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా లోకసభకు పోటీ చేశారు. యాదవ సామాజిక వర్గం కావడం, ఆర్థికంగా బలంగా ఉండడం ఆయనకు కలిసరానుంది.
తన కుమారుడికి టికెట్ ఇస్తే అన్నీ తానై గెలిపించుకుంటానని తలసాని శ్రీనివాసయాదవ్ పార్టీ పెద్దలకు చెప్పారని, వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. 2018, 2023లో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది. మారిన సమీకరణాల రీత్యా బలమైన అభ్యర్థిని బరిలోకి దింపితేనే గెలుపు సాధ్యమని పార్టీ నేతలు భావిస్తున్నారు. గతంలో బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2018, 2023 లో పోటీ చేసినా ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా ఇక్కడ కాషాయజెండా ఎగరేయాలని పార్టీ భావిస్తోంది. ఈసారి మళ్లీ చింతల రాంచంద్రారెడ్డికే అవకాశం ఇస్తారా? అన్న విషయంలో క్లారిటీ లేదు. టికెట్ కోసం చింతలతో పాటు అడ్వకేట్ ఇంద్రసేనా రెడ్డి, వ్యాపారవేత్త జూటూరి కీర్తిరెడ్డి, పీవీ మనువడు ఎన్వీ సుభాష్ ఆసక్తి చూపిస్తున్నారు.
ఒక్కసారి బీజేపీ.. రెండుసార్లు బీఆర్ఎస్..
తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఖైరతాబాద్‌కు మూడు సార్లు ఎన్నికలు జరగగా 2014 లో బీజేపీ గెలిచింది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ వరుసగా బీఆర్ఎస్ విజయం సాధించింది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాద్ నగరానికి సెంటర్ పాయింట్ గా ఉంటుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 2, 89, 558 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ‘సర్’లో భాగంగా సుమారు లక్షకు పైగా ఓట్లను తొలగించినట్టు సమాచారం. ఈ లెక్కన 1.70 లక్షల ఓటర్లుండే అవకాశం ఉంది. నియోజకవర్గ పరిధిలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, లక్డికపూల్ తదితర ప్రాంతాలున్నాయి.
సంపన్నులుండే పోష్ కాలనీలు.. మధ్యతరగతి, పేదలుండే బస్తీలు, మురికివాడలు సమానంగా ఉంటాయి. చింతల్ బస్తీ, ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా, దేవరకొండ బస్తీ, జహీర్ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, దీన్ దయాళ్ నగర్ తో పాటు సుమారు 50 కిపైగా బస్తీలున్నాయి. సంపన్నులుండే ఏరియాల్లో ఎప్పుడు 20 నుంచి 30 శాతం కన్నా ఎక్కువ పోలింగ్జరగడంలేదు. బస్తీల్లో మాత్రం 60 నుంచి 70 శాతం పోలింగ్ నమోదు అవుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపును బస్తీ వాసులు, మురికి వాడల ఓటర్లే నిర్ణయిస్తారు.. కాబట్టి ఇక్కడ మాస్ లీడర్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
