- బాల భరోసా కార్యక్రమంలో 1600 మందిని గుర్తించిన ప్రభుత్వం
- కంటి, వినికిడి, గుండె, నరాలు, ఇతర సమస్యలు ఉన్నవారికి ట్రీట్ మెంట్ కు ఏర్పాట్లు
- ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా సర్జరీలు, కళ్లద్దాలు, వినికిడి మిషన్ల పంపిణీ
- ఒక్కో చిన్నారికి ఒక్కో స్పెషల్ ఆఫీసర్ నియామకం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అంగన్‌వాడీ సెంటర్లలో చదువుతున్న ఐదేండ్లలోపు చిన్నారుల్లో ఏకంగా 1,600 మందికి ఎదుగుదల లోపాలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు సర్కార్ గుర్తించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాల భరోసా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్పెషల్ స్క్రీనింగ్‌లో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్టుల్లో మొత్తం 1,600 మంది చిన్నారులను గుర్తించగా.. అందులో హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా సుమారు 250 మంది చిన్నారులు, రంగారెడ్డిలో 200 మంది, మహబూబ్‌నగర్‌లో సుమారు 200 మంది ఉన్నారు.
అత్యల్పంగా నారాయణపేటలో ఏడుగురు, హనుమకొండ, మంచిర్యాల జిల్లాల్లో ఆరుగురు చొప్పున, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక్క చిన్నారిని మాత్రమే గుర్తించారు. అయితే, పేదరికం, అవగాహన లేకపోవడంతో తల్లిదండ్రులు గుర్తించలేక నిర్లక్ష్యానికి గురైన ఈ రుగ్మతలను నయం చేసేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయి కార్యాచరణను సిద్ధం చేసింది. బాధిత చిన్నారులందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా పైసా ఖర్చు లేకుండా ఉచిత వైద్యం, అవసరమైన సర్జరీలు అందించాలని నిర్ణయించింది.
పక్కా పర్యవేక్షణకు వన్ టు వన్ ఫార్ములా..
కొన్ని జిల్లాల్లో వందల సంఖ్యలో బాధితులు ఉన్నందున మూకుమ్మడిగా కాకుండా, ఒక్కో చిన్నారి బాధ్యతను ఒక్కో స్పెషల్ ఆఫీసర్‌కు అప్పగిస్తూ వన్ టు వన్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 1,600 మంది చిన్నారులకు ఒక్కొక్కరికి ఒక స్పెషల్ ఆఫీసర్‌ను కేటాయించనున్నారు. ఇప్పటికే సగానికి పైగా అధికారుల కేటాయింపు పూర్తయినట్లు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు. సంబంధిత చిన్నారికి వైద్యం ఎక్కడ చేయించాలి, ఎలాంటి చికిత్స అవసరమనే అంశంపై ఈ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు.
హాస్పిటల్‌లో అడ్మిట్ చేయడమే కాదు, చిన్నారి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యే వరకూ ప్రతి దశనూ పర్యవేక్షించాల్సి ఉంటుంది. చిన్నారికి ఎలాంటి సమస్య ఉంది, ఏ హాస్పిటల్‌కు తరలించారు, ఏ రోజున అడ్మిట్ చేశారు, ఎలాంటి సర్జరీ లేదా వైద్యం అందించారు, సర్జరీ తర్వాత రికవరీ ఎలా ఉంది, ఆ లోపం పూర్తిగా నయమైందా లేదా అన్న రిపోర్టులను ప్రభుత్వానికి సమర్పించాలి.
ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చికిత్సలు..
చిన్నారుల సమస్య తీవ్రతను బట్టి చికిత్స స్థాయిని ప్రభుత్వం వర్గీకరించింది. పోషకాహార లోపాలు, చిన్నపాటి సమస్యలున్నవారికి స్థానిక ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్ర దవాఖాన్లు, డీఈఐసీ కేంద్రాల్లోనే చికిత్స అందిస్తారు. క్లిష్టమైన సమస్యలు, పెద్ద ఆపరేషన్లు అవసరమైనవారిని హైదరాబాద్‌లోని నిలోఫర్, గాంధీ, ఉస్మానియా, నిమ్స్, సరోజినీదేవి కంటి దవాఖాన, కోఠి ఈఎన్‌టీ హాస్పిటల్స్‌కు రిఫర్ చేయిస్తారు. చూపు మందగించిన చిన్నారులకు వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా కళ్లద్దాలు ఇవ్వడం లేదా ఆపరేషన్లు చేస్తారు. వినికిడి లోపం ఉన్నవారికి చెవి మిషన్లు, అవసరమైన కేసుల్లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు చేయిస్తారు. పుట్టుకతో వచ్చే గుండె రంధ్రాలు, నరాల వ్యాధులు, ఎముకల వంకరలకు ఆరోగ్యశ్రీ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ఉచితంగా సర్జరీలు పూర్తి చేయిస్తారు.
పేదరికం, అవగాహన లేక తల్లిదండ్రుల నిర్లక్ష్యం..
అంగన్‌వాడీ సెంటర్లకు పిల్లలను పంపే కుటుంబాల్లో అత్యధికం నిరుపేదలు, రోజువారీ కూలీలే ఉంటున్నారు. ఉదయం లేస్తే పనులకు వెళ్లాల్సిన నిస్సహాయత, ఆర్థిక ఇబ్బందులు, అవగాహన లోపం వల్ల తమ పిల్లల్లో మొదలయ్యే శారీరక, మానసిక లోపాలను సకాలంలో కనిపెట్టలేకపోతున్నారు. పిల్లల్లో చూపు మందగించడం, వినికిడి లోపాలు, మాటలు ఆలస్యంగా రావడం, నడకలో వంకరలు, పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత సమస్యలను ప్రారంభంలో గుర్తించకపోవడంతో ఆ రుగ్మతలు ముదిరిపోయి జీవితాంతం వైకల్యానికి దారితీస్తున్నాయి.
ఈ ముప్పును ఆదిలోనే అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, హెల్త్ డిపార్ట్‌మెంట్ (ఆర్బీఎస్‌కే) ద్వారా ఈ కార్యక్రమం చేపట్టి, 1,600 మంది బాధితులను గుర్తించింది. ఈ కార్యక్రమంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో, గుర్తించిన ప్రతి చిన్నారిని పూర్తి ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దేందుకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు చెబుతున్నారు.
